World Sleep Day: పడుకునే ముందు ఇవి తిన‌కూడ‌దు

ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది నిద్ర. పడుకున్నప్పుడే మెదడు, శరీర భాగాలను రీచార్జ్​ చేస్తుంది. అందువల్లే ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని సూచిస్తారు నిపుణులు. నిద్రలేమి కారణంగా తలనొప్పి, గుండె జబ్బులు, వాంతులు, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిద్ర లేని కారణంగా చాలామంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే నిద్ర చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, మానసిక ఒత్తిడి, ఆలోచనలు, పడుకునే ప్రదేశం, వెలుతురు, ఉష్ణోగ్రత వంటి చాలా విషయాలు నిద్రను ప్రభావితం చేస్తాయి. అయితే నిద్ర పోవడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. పలు ఆహార పదార్థాలు నిద్రను దూరం చేస్తాయని అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ప్రపంచ నిద్ర దినోత్సవం కారణంగా పడుకునే ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

టమోటా
టమోటాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. అయితే పడుకోవడానికి ముందు మాత్రం టమోటాలు తినడం అంత మంచిది కాదనేది నిపుణుల మాట. ఎందుకంటే వీటిలోని టైరమైన్​ మెదడును ప్రేరేపించి నిద్రను దూరం చేస్తుంది. అంతేకాదు వీటిలోని ఆమ్ల స్వభావం వల్ల పడుకునే ముందు తింటే అజీర్ణంతో జీర్ణసమస్యలు ఎదురవుతాయి. ఎసిడిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. టమోటాలే కాదు విటమిన్​ సి ఉండే సిట్రస్​ జాతి పండ్లను పడుకోవడానికి ముందు తినకపోవడమే మంచిది.

వైట్ బ్రెడ్
వైట్ బ్రెడ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్‌లతో పాటు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇటువంటి ఆహారాలు నిద్రలేమి సమస్యలను కలుగజేస్తాయని అనేక పరిశోధనల్లో తేలింది. అధిక GI ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది నిద్ర సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కడుపులో మంట కలిగిస్తుంది. తద్వారా నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

మసాలా ఆహారాలు
మసాలా ఆహారాలు శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారి తీస్తాయి. కొన్ని మసాలా ఆహారాలు యాసిడ్ రిఫ్లక్స్, ఇతర గట్ సమస్యలను కలిగిస్తాయి. అజీర్ణం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అందుకే నిద్రపోయే ముందు జంక్ ఫుడ్​, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మసాలా ఆహారాల్లోని అధిక pH స్థాయిలు అసమతుల్యతకు కారణమవుతాయి. ఛాతిలో మంట, ఉబ్బరం వంటి సమస్యలు కూడా నిద్రలేమికి దారితీస్తాయి.

ఐస్ క్రీం
రాత్రి భోజనం చేసి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని పదార్థాలు తినకూడదు. ముఖ్యంగా ఐస్ క్రీం తినకూడదు., ఐస్‌క్రీమ్‌లో కొవ్వులు, చక్కెర అధికంగా ఉంటాయి. ఈ రెండూ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. చాలా కొవ్వులు ఉన్న ఆహారాలు జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు నిద్రలేమి సమస్యను అధికం చేస్తాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి.

చాక్లెట్
పడుకునే ముందు చాక్లెట్లు, చాక్లెట్​తో చేసే పదార్థాలను కూడా తీసుకోకూడదు. కొన్ని రకాల చాక్లెట్లలో ఉండే టైరోసిన్ మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. అందువల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే థియోబ్రోమిన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది నిద్ర సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు చాక్లెట్లలోని కెఫిన్ కంటెంట్ నిద్రలేకుండా చేసి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల పడుకునే ముందు, రాత్రి భోజనం తర్వాత చాక్లెట్లు తినకూడదు.