దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా.. అవినాష్ తల్లి బహిరంగ లేఖ
YS Lakshmi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సతీమణి వైఎస్ సౌభాగ్యమ్య రాసిన లేఖకు కౌంటర్‌గా.. ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ బహిరంగ లేఖను రాసారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా అని సునీతా రెడ్డిపై నిందలు వేసారు.
“” అమ్మా సౌభాగ్యమ్య 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఎంతో కుమిలిపోయాడని మీకు ఇప్పుడు గుర్తుకు వస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్న చూపు చూసినప్పుడు జగన్‌కు పెద్ద దిక్కుగా నిలివాల్సిన మీరు జగన్‌ను ఒంటరి వాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన మీకు గుర్తుకురాలేదా? 2011లో నీ భర్తను నువ్వు, నీ కూతురు, నీ అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీలేదా? నీ కూతురు, అల్లుడు పూల అంగళ్ల వద్ద డిగ్రీ కాలేజ్‌లో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారి మనోవేదన నీకు గుర్తుకు రాలేదా?
వివేకానంద రెడ్డి జగన్‌ను సీఎంగా చూడాలనుకున్న మాట వాస్తవం. 2019 మార్చి 14న రాత్రి అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు ప్రచారం చేసిన మాట కూడా వాస్తవమే. ఈ మాట స్వయంగా సునీతా రెడ్డే బయటికి చెప్తోంది. ఇప్పుడు మీరు అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని సంబంధం లేని వారిని తప్పుడు కేసుల్లో ఇరికించడం తప్పు అనిపించడంలేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు? నీ కూతురు నిజమైన న్యాయ పోరాటం చేస్తుంటే జగన్ తప్పకుండా సాయం చేస్తాడు. అది వదిలేసి సంబంధం లేని వ్యక్తిని తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు కాబట్టే జగన్ ఏమీ చేయలేకపోతున్నాడు. హత్యకు కారకులైన వారు మీలోనే మీతోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఆ దొంగ ఎలా దొరుకుతాడు?
మాటి మాటికీ అవినాష్‌ను హంతకుడు అని తిడుతున్నారు. కోర్టులో కేసు ఇంకా నడుస్తుంటే మీరు హంతకుడు అని ఎలా అంటారు? ఇప్పటికైనా వైఎస్సార్, జగన్ శత్రువుల చేతిలో పావులా మారకుండా చేసిన తప్పు తెలుసుకుని న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వల్ల ఇతరులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోండి. నిజం ఎంత లోతుగా దాచిన దాగదు. తప్పకుండా బయటపడుతుంది “” అని పేర్కొన్నారు.