AP Elections: కూటమి గెలిస్తే డిప్యూటీ సీఎంగా పవన్?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. ఈలోగా గెలిచేది కూటమా లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనా అనే అంశంపై చాలా మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఎవరు గెలుస్తారు అనే అంశంపై పక్క రాష్ట్రాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఎవరు గెలిచినా గెలవకపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపుపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా మంది పవన్ ఈసారి పిఠాపురం నుంచి గెలుస్తారు అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అయితే పవన్ గెలిస్తే ఏ పదవి రాబోతోంది? ఓడిపోతే ఏ పదవి లభిస్తుంది? అనే అంశంపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పవన్ పిఠాపురం నుంచి గెలిస్తే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారు. అదే ఓడిపోతే మాత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు సెంట్రల్ మినిస్టర్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారని మొన్నటి వరకు ఒక టాక్ నడిచింది.
ఇప్పుడు మరో విషయం తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒకవేళ తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి గెలిస్తే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటూ ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి.. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని నరేంద్ర మోదీ అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.