Lok Sabha Elections: గెలుపెవ‌రిది? స‌ర్వేలు ఏం చెప్తున్నాయ్‌?

Lok Sabha Elections: దేశంలో మారుతున్న పోక‌డలు, అభివృద్ధి న‌మూనాలు ఇప్పుడు ప్ర‌మాదంలోకి నెట్టేస్తున్నాయా? ప్ర‌మోదం దిశ‌గా తీసుకెళ్తున్నాయా? అనే విషయంలో ఎంతో ఆతృత నెల‌కొంది. 2004 ఎన్నిక‌ల్లో నాటి ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ఇండియా షైనింగ్ అంటూ ఎన్నిక‌ల హోదాలో దిగితే ఇండియా డిస్ట‌ర్బింగ్ అంటూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని UPA కూట‌మి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండ‌వు.

నాటి ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఇప్పుడు దేశం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) భార‌తీయ జ‌న‌తా పార్టీ అధినాయ‌క‌త్వం గుప్పిట్లోకి వెళ్లిపోయింద‌న్న భావన క‌లుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో సొంతంగా మెజారిటీ సీట్ల‌ను సాధించి అధికారంలోకి వ‌చ్చిన క‌మ‌ల‌నాథులు 2019లో 300 సీట్ల‌కు పైగా గెలిచి తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి 370 స్థానాల‌ను సొంతంగా గెలుచుకోవాల‌ని కూట‌మితో స‌హా 400 సీట్ల‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.

అదే స‌మ‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని NDA ప‌క్షాల‌ను ఢీకొట్టాల‌ని చూస్తున్న కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని ఇండియా కూట‌మి ఎన్నో అరిష్ఠాల న‌డుమ గంద‌ర‌గోళంలో కూరుకుపోయింది. అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ అనుకున్న సీట్ల‌లో గెల‌వ‌క‌పోతే ఆ త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా మార‌తాయో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ విష‌యం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌హా భార‌తీయ జ‌న‌తా పార్టీ పెద్ద‌ల‌కు కూడా తెలుసు. అందుకే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే సామాన్యుడిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలను చేసారు. (Lok Sabha Elections)

కానీ వీట‌న్నింటినీ నిశితంగా గ‌మ‌నిస్తున్న సామాన్య ఓట‌రు ఈసారి ఇచ్చే తీర్పు ఎవ‌రికి మైండ్ బ్లాంక్ చేస్తుంది> ఎవ‌రిని అంద‌లం ఎక్కిస్తుంది? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నా భార‌తీయ జ‌న‌తా పార్టీకి తిరుగులేద‌న్న భావ‌న‌ను ప‌లు స‌ర్వే సంస్థ‌లు వ్య‌క్తం చేస్తున్నాయి. కానీ తేడా వ‌స్తే ఏం జ‌రుగుతుంది? అస‌లు ఓట‌ర్లు ఎందుకు ఓటేస్తారు? అనేదానిపై జాతీయ రీసెర్చ్ సంస్థ‌లు ప‌లు విశ్లేష‌ణ‌లు చేస్తున్నాయి. ఎన్నిక‌ల్లో ఏ అంశాలు ప్ర‌భావితం చేస్తున్నాయి? ఎవ‌రు ఎందుకు గెలుస్తున్నారు? ఎందుకు ఓడుతున్నారు అనే అంశంపై మొత్తం ఆధార‌ప‌డి ఉంది.దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య క్ర‌తువుకు అంకురార్ప‌ణం జరిగింది. ఎన్నిక‌ల న‌గారా మోగింది.

వ‌చ్చే నెల‌న్న‌ర రోజుల పాటు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటూనే ఉంటుంది. తుది ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కు రాజ‌కీయం ర‌క్తి క‌డుతూనే ఉంటుంది. అయితే ఇప్ప‌టికే ఫ‌లానా పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని వాళ్లు అవుట్ వీళ్లు అవుట్ అంటూ అనేక విశ్లేష‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒపీనియ‌న్ పోల్స్ ఎక్కువ‌గా వెల్లువెత్తుతున్నాయి. మొన్న‌టివ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ఎన్డీయే ఒక్క‌సారిగా మిత్రుల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకుంటోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో రాణించాల‌ని NDA భాగ‌స్వామ ప‌క్ష‌లు త‌ల‌పోస్తున్నాయి. రాష్ట్రీయ లోక్ ద‌ళ‌, తృణ‌మూల్ కాంగ్రెస్ వంటి మిత్ర ప‌క్షాలు NDAను విడిచిపెట్టేసాయి. ఇక తెలుగు దేశం పార్టీ, నితీష్ కుమార్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌తా ద‌ళ్ యునైటెడ్ పార్టీలు, ఘ‌ర్ వాప‌సీతో NDA కూట‌మికి మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి.

ఓవైపు ఇండియా కూట‌మిలో బ‌ల‌మైన మిత్రులు ప‌క్క‌కు వెళ్లిపోవ‌డం మ‌రోవైపు కీల‌క పార్టీలు ఎన్డీయేతో భాగ‌స్వామ్యం కావ‌డం ఎన్నిక‌ల‌కు ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. NDA విజ‌యంపై ధీమాతో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో 400లకు పైగా సీట్లు సాధించాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నారు. వివిధ స‌ర్వేలు NDAకు 335 నుంచి 398 స్థానాల మ‌ధ్య గెల‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తుంటే.. NDA కూట‌మికి 93 నుంచి 166 రావ‌చ్చు అంటున్నాయి. ఈ ఒపీనియ‌న్ పోల్స్ చాలా సందర్భాల్లో క‌రెక్ట్ అయిన‌ప్ప‌టికీ ప‌లు సార్లు లెక్క త‌ప్పిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అనుకున్న ఫ‌లితాలు రాక ల‌బోదిబో మ‌న్నాయి. 2024 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ముందే ప‌సిగ‌ట్టొచ్చా అంటే క‌చ్చితంగా చెప్ప‌లేం. ఈ సారి ఏ అంశాలు ప్ర‌భావితం చూపుతాయి అనే అంశంపై ఆతృత ఉంది. ఎన్నో అంశాలు 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూప‌బోతున్నాయి.  (Lok Sabha Elections)