Kavitha Arrest: BRS పని అయిపోయినట్టేనా? కవిత అరెస్ట్‌తో ఏం జరగబోతోంది?
Kavitha Arrest: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు. నిన్న రాత్రంతా కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ రోజు ఆమెకు మెడికల్ చెకప్స్ నిర్వహించి కోర్టులో ప్రవేశపెడతారు.
ఇరత సమయాల్లో కవితను అరెస్ట్ చేసి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. సరిగ్గా ఈరోజు లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో శుక్రవారం కవిత అరెస్ట్ జరిగింది. అదీకాకుండా నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఓపక్క కవిత అరెస్ట్ జరుగుతుంటే మరోపక్క ఆయన మల్కాజ్‌గిరిలో రోడ్ షో నిర్వహించారు. సరిగ్గా ఎన్నికలకు ముందే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నేతలను అరెస్ట్ చేస్తూ ఉంటుంది. అదేదో కేంద్రం నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినట్లు. ఇప్పుడు కవిత విషయంలోనూ ఇదే జరిగిందని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి కవిత అరెస్ట్‌తో మరింత బలహీన పడిపోయిందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు BRSను వీడి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. దాంతో ఎంపీ స్థానాల్లో భారత రాష్ట్ర సమితి ఎవ్వరినీ నియమించలేని పరిస్థితిలో ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చే పాయింట్. గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచిందో అంతకంటే కాస్త ఎక్కువే ఇప్పుడు పడేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. (Kavitha Arrest)
ఎంపీగా పోటీ చేయాలన్న కల
కవితకు ఎంపీగా పోటీ చేయాలన్న కోరిక ఉందట. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల సమయంలో ఆమే స్వయంగా వెల్లడించారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి మీరేనా అని అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇస్తూ.. ముందు ఎంపీ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడే సీఎం అవ్వడం చాలా కష్టం. ఇంకా ఎంతో అనుభవం కావాలి. అప్పటివరకు ప్రజలు నన్ను ఎంపీగా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను అని తెలిపారు. ఈ లోగా కవిత ఇలా అరెస్ట్ అవ్వడం బాధాకరం.