టార్గెట్ జగన్.. ఇది మూడో దాడి..!
Jagan: ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఈరోజు విజయవాడలో రాళ్ల దాడి జరిగింది. ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతుండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. దాంతో ఆయన ఎడమ కంటిపై, ఎడమ చేతిపై గాయాలయ్యాయి. కంటిపై రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యులు శస్త్రచికిత్స చేసారు.
2018లో తొలి దాడి
అయితే జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నికల సమయంలో వరుస దాడులు జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఆయన అసలు రాజకీయ ప్రవేశం 2018 ఎన్నికల సమయంలో జరిగింది. ఆ సమయంలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో జగన్‌ను పొడిచాడు. దాంతో జగన్‌కు తీవ్ర రక్తస్రావం అయ్యింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. తాను జగన్‌కు అభిమానినని.. ఇలా కోడికత్తితో దాడి చేస్తే సానుభూతితో జగన్ గెలుస్తాడని దాడి చేసానే తప్ప వేరే ఉద్దేశంతో కాదని అన్నాడు. అలా ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిన శ్రీనుకి ఫిబ్రవరిలో బెయిల్ వచ్చింది.
చెప్పు విసిరి..
ఇలా ఉండగా.. మొన్న మార్చి నెలలో జగన్ అనంతపురంలోని గుత్తిలో ప్రచారంలో పాల్గొనగా.. ఓ వ్యక్తి వెనక నుంచి జగన్‌పైకి చెప్పు విసిరాడు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆ చెప్పు జగన్‌కి తగలకుండా వాహనంపై పడింది. దాంతో వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకునేందుకు యత్నించారు కానీ అతను దొరకలేదు.
రాళ్లు విసిరి..
ఇక మూడో విషయానికొస్తే.. జగన్‌పై ఈరోజు విజయవాడలో రాళ్లు విసిరింది తెలుగు దేశం పార్టీ మనుషులే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కోసం వస్తున్న జనాన్ని చూసి ఎక్కడ ఓడిపోతామో అని భయపడి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోపక్క తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం ఈ రాళ్ల దాడి మరో కోడికత్తి డ్రామాలా ఉందని అన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందే జగన్ తనపై ఏదో ఒక రకమైన దాడి చేయించుకుని సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు.