Pawan Kalyan: టీ గ్లాసు కలిపింది ఇద్దరినీ..!
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే (AP Elections) కాకుండా లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కూడా పోటీ చేస్తున్నారని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేయనున్నారని అనుకున్నారు. అయితే పవన్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాకినాడ ఎంపీగా టీ టైం ఫౌండర్ ఉదయ్ శ్రీనివాస్‌ని ప్రకటించారు.
ఎవరీ ఉదయ్ శ్రీనివాస్?
హైదరాబాద్‌లోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ చదివిన ఉదయ్ శ్రీనివాస్.. ఉద్యోగం నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ లక్షల్లో సంపాదిస్తూ లగ్జరీ జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆ ఉద్యోగం చేయలేక సంపాదించుకున్నది టీ బిజినెస్‌లో పెట్టాలనుకున్నాడు. అలా దుబాయ్‌లో ఉద్యోగానికి రిజైన్ చేసేసి హైదరాబాద్ వచ్చేసాడు. 2016లో రాజమండ్రిలో రూ.5 లక్షలు పెట్టి టీ టైం పేరుతో ఓ షాప్ తెరిచారు ఉదయ్. అది బాగా అభివృద్ధిలోకి రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 3000 అవుట్ లెట్స్‌ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ టీ టైం అవుట్‌లెట్ టర్నోవర్ రూ.35 కోట్లు. ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారంభించిన టీ టైంను ఇప్పుడు 45 మంది ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్నారు. ఉదయ్ భార్య బకుల్ ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలు.