ఖ‌మ్మం బ‌రిలో సుహాసిని.. ప్ర‌చారానికి తారక్?

Nandamuri Suhasini: జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు (JR NTR సోద‌రి అయిన నంద‌మూరి సుహాసిని ఎప్ప‌టినుంచో రాజ‌కీయాల్లో ఉన్నారు.  తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారాల్లో, స‌భ‌ల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఖ‌మ్మం సీటును ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది కాంగ్రెస్ పార్టీ. అదే నిజం అయితే.. త‌న సోద‌రిని గెలిపించుకునేందుకు తార‌క్ ప్ర‌చారానికి కూడా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

నంద‌మూరి సుహాసిని 2018లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున కూక‌ట్‌ప‌ల్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ కూట‌మిగా వ‌చ్చినా అప్ప‌టి తెలంగాణ రాష్ట్ర స‌మితి (TRS) గెలిచింది. 2023లో తెలంగాణ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయ‌లేదు. దాంతో సుహాసిని కూడా రాజ‌కీయంగా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆమె ఆంధ్ర‌ప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్నార‌ని తెలుస్తోంది. వ‌ల్ల‌భ‌నేని వంశీని ఓడించ‌డానికి గ‌న్న‌వ‌రం నుంచి బ‌రిలో ఉంటార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

నంద‌మూరి తార‌క రామారావు సొంత గ‌డ్డ అయిన గుడివాడ నుంచి పోటీ చేసి YSRCP నేత కొడాలి నానిని ఓడించ‌బోతున్నార‌ని కూడా అన్నారు. కానీ ఇవేమీ జ‌ర‌గ‌లేదు. స‌డెన్‌గా ఆమె తెలంగాణ రాజ‌కీయ తెర‌పై మెరిసారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక చంద్ర‌బాబు నాయుడు మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌ని తెలుస్తోంది. తెలుగు దేశంలో ఉన్న త‌న మేన‌కోడ‌లిని కాంగ్రెస్ వైపు న‌డిపించారన్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి గ‌తంలో తెలుగు దేశం పార్టీ నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న పార్టీలో సుహాసిని చేరితే రాజ‌కీయంగా ఆమెకు మేలు జ‌రుగుతుంద‌న్న టాక్ కూడా ఉంది.

సుహాసినికి రేవంత్ రెడ్డి ఖ‌మ్మం లోక్‌స‌భ టికెట్ ఇచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌నేది టాక్. ఖ‌మ్మం కాంగ్రెస్‌కి కంచుకోట‌. ఖ‌మ్మంలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క‌టి త‌ప్ప అన్ని సీట్ల‌ను హ‌స్తం పార్టీ గెలుచుకుంది. 2019లో మాత్రం ఖ‌మ్మం ఎంపీ సీటు తెరాస గెలిచింది. దానికంటే ముందు 2014లో వైసీపీ గెలుచుకుంది. ఇలా కాంగ్రెస్ ఓట్లు షిఫ్ట్ అవ్వ‌డం వ‌ల్లే వైసీపీ గెలిచింద‌ని అనుకున్నారు. 2004 త‌ర్వాత ఖ‌మ్మం లోక్ స‌భ‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌లేదు. దాంతో ఆ పార్టీ బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను బ‌రిలోకి దించాల‌ని చూస్తోంది. ఖ‌మ్మం లోక్ స‌భ సీటు ఈసారి కాంగ్రెస్ క‌చ్చితంగా గెలుచుకుంటుంద‌ని భావించి ఆ పార్టీలో సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ ఏర్ప‌డింది.

మ‌రోప‌క్క ఖ‌మ్మం సీటును మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క త‌న భార్య‌కు ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ట‌. ఇందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకోవ‌డంలేద‌ని తెలుస్తోంది. దాంతో భ‌ట్టికి రేవంత్‌కి మ‌ధ్య ఈ విషయంలో కోల్డ్ వార్ జరుగుతోంద‌ని టాక్ వినిపిస్తోంది.