సిరిసిల్లకు సినిమా వచ్చిందా‌‌‌‌- ‘బలగం’ ప్రీరిలీజ్ వేడుకలో కేటీఆర్

టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యంతో రూపొందుతున్న సినిమాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం కమెడియన్లు, విలన్లకు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాను ఏలేస్తుంది. తాజాగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన మరో సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సిరిసిల్లలో జరగ్గా.. దానికి తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హర్షిత్, హన్షిత నిర్మించిన తొలి చిత్రం ‘బలగం’. కమెడియన్‌ వేణు ఎల్దండి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఇప్పటికే ప్రివ్యూ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘బలగం’ మూవీ సిరిసిల్ల జిల్లాలోనే చిత్రీకరణ జరుపుకుంది. ఈ మేరకు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్‌లో నిర్వహించగా.. ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్ ప్రసంగం ప్రేక్షకులతో పాటు చిత్ర బృందంలో జోష్ నింపింది.
ఈ వేడుకకు హాజరైన జన సందోహాన్ని చూసి ‘బతుకమ్మ ఘాట్ కళకళలాడుతోందా.. సిరిసిల్లకు సినిమా వచ్చిందా.. హ్యాపీనా’ అంటూ స్పీచ్ ప్రారంభించారు కేటీఆర్. ముందుగా సిరిసిల్లకు సినిమాను తెచ్చిన దర్శకుడు వేణును హృదయపూర్వకంగా అభినందిస్తూ.. నటుడిగా వేణు తెలుసు కానీ ఇంత అద్భుతంగా సినిమా తీస్తాడని ఊహించలేదన్నారు. కాసర్ల శ్యామ్ పాటలు, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌ను మెచ్చుకున్నారు. ఇక సినిమా గురించి చెప్తూ.. గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఎమోషన్‌ను చక్కగా తెరకెక్కించారని, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని చెప్పారు.
చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ ఏమీ ఉండవని, అప్పుడప్పుడు చిన్న సినిమాలే పెద్ద సినిమాలను ఉప్పెనలా ఊపేస్తాయని అన్నారు కేటీఆర్. ఇక ఈ చిత్ర నిర్మాతలు హన్షిత్, హర్షితను దిల్ రాజు తొక్కేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే అందరూ దిల్ రాజు గురించే మాట్లాడుతున్నారని.. దాన్ని అధిగమించి వారు కూడా సెపరేట్ ఐడెంటిటీ తెచ్చుకోవాలన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఈ సినిమాను ఆయన కూతురు హన్షిత రెడ్డి, తమ్ముడి కొడుకు హర్షిత్ సంయుక్తంగా నిర్మించారు. మంచి కంటెంట్ ను నమ్ముకొని బలగం సినిమాకు బ్యాకప్ చేశాడు దిల్ రాజు. బలగం సినిమా మార్చ్ 3న థియేటర్లలో విడుదల కానుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి!