ఇజ్రాయెల్ భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది.. మ‌రి భార‌త్?

26/11 ముంబై ఉగ్ర‌దాడిని స్మ‌రించుకుంటూ ఆ దాడుల‌కు కార‌ణ‌మైన పాకిస్థాన్ ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తైబాను  (lashkar -e-taiba) నిషేధిస్తున్న‌ట్లు ఇజ్రాయెల్ (israel) ప్ర‌క‌టించింది. ఎందరో భార‌తీయుల చావుల‌కు కార‌ణం అయిన ల‌ష్క‌రే తైబాను నిషేధించాల‌ని త‌మ‌ను భార‌త ప్ర‌భుత్వం అడ‌గ‌లేద‌ని.. అయినా కూడా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

మ‌రి ఇజ్రాయెల్ భార‌త్‌కు స‌పోర్ట్‌గా ఆ ఉగ్ర‌వాద సంస్థ‌ను నిషేధించిన‌ప్పుడు.. ఇజ్రాయెల్‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న గాజాలోని ఉగ్ర‌వాద సంస్థ హ‌మాస్‌ను (hamas) ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టిస్తుందా అనేది ఇప్పుడు ఉన్న ప్ర‌శ్న. త‌మ‌లాగే ఇండియా కూడా హ‌మాస్‌ను ఉగ్ర‌వాద సంస్థగా ప్ర‌క‌టిస్తూ నిషేధం విధించి త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని ఇజ్రాయెల్‌కు చెందిన భార‌త‌ దౌత్యాధికారి నావోర్ గిలోన్ ఆశాభావం వ్య‌క్తం చేసారు. అలాగ‌ని ఇజ్రాయెల్ భార‌త్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావ‌డంలేద‌ని.. భార‌త్‌కు ఆలోచించి నిర్ణ‌యం తీసుకునే తెలివి ఉంద‌ని తెలిపారు.