Hydraa vs GHMC: నువ్వా నేనా
Hydraa vs GHMC: జీహెచ్ఎంసీలో తన మార్క్ పాలన కోసం ఓ అధికారి తాపత్రయ పడుతుంటే, అదే గ్రేటర్ విషయంలో తన పెత్తనం కోసం మరో అధికారి చూపుతున్న అత్యుత్సాహం వల్ల ఆ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్‌కు దారితీసినట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య అంతర్గత వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ ఉద్యోగులు కార్పొరేషన్ పనులను వదిలేసి హైడ్రా వెంట తిరుగుతుండటంతో గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలి ఇటీవల కన్నెర్రజేశారు. జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. సహజంగా ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి రావాల్సి ఉండగా ఇప్పుడు హైడ్రా వద్దకు వెళ్తుండడంతో గ్రేటర్ పాలకమండలి మండిపడుతున్నట్టు తెలిసింది.
తమకు ప్రాధాన్యత తగ్గిపోతున్నదని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్లినా హైడ్రా మాటే తప్ప జీహెచ్ఎంసీ మాటే లేదని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారట. ఇక హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను జీహెచ్ఎంసీకి పంపడంతో మరో వివాదం తలెత్తుతోంది. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ చేయాలని జీహెచ్ఎంసీకి హైడ్రా కమిషనర్ లేఖ పంపుతున్నారు. తమ పనులకే సమయం చాలడం లేదంటే మళ్లీ ఈ హైడ్రా ఫిర్యాదుల గోల ఏమిటని గ్రేటర్ అధికారులు మండిపడుతున్నారు.