Donald Trump: సొంత బ్రాండ్‌ షూస్‌ విడుదల చేసిన ట్రంప్‌

Donald Trump: రాజకీయం అంటే రాజకీయమే అన్నట్లు వ్యవహరించే రోజులు పోయి చాలాకాలమే అయ్యింది. ఆ మాటకు వస్తే రాజకీయం చేస్తూనే పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయటం చూస్తున్నాం.నిజానికి ఇప్పుడున్న రాజకీయాల్లో నూటికి 90 శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేస్తున్న పొలిటీషిన్లే కనిపిస్తారు. కానీ.. అగ్రరాజ్యానికి దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వ్యాపారాల్ని చక్కబెట్టే నేతల్ని అరుదుగా చూస్తుంటాం. అలాంటి స్పెషల్ రాజకీయ నేతగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గురించి చెప్పాలి.

ఓవైపు అమెరికాకు మరోసారి అధ్యక్షుడు అయ్యేందుకు ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. తన వ్యాపార కార్యాకలాపాల్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ట్రంప్ తన సొంత బ్రాండ్ షూస్ ను విడుదల చేశారు. ఆదివారం ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్ లో వాటిని ప్రదర్శించిన ఆయన.. గోల్డ్ కలర్ షూను 399 డాలర్లకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

షూతో పాటు పెర్ ఫ్యూమ్ ను కూడా విడుదల చేయటం విశేషం. విక్టరీ 47 పేరుతో సెంటును విడుదల చేశారు. ఓవైపు ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపారన్న అభియోగాన్ని ఎదుర్కొని.. న్యాయస్థానం చేత భారీ జరిమానా విధించుకున్న పక్క రోజునే తన బ్రాండ్ వస్తువుల్ని మార్కెట్ లోకి విడుదల చేయటం చూస్తే.. ట్రంపా మజాకానా? అన్న భావన కలుగక మానదు. తాజాగా ఇచ్చిన తీర్పులో ఆయనకు 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానాను కోర్టు విధించింది. ఏమైనా వివాదాలతో సహవాసం చేసే ట్రంప్.. రాబోయే ఎన్నికల్లో తన ముద్ర చూపాలని.. మరోసారి అమెరికాకు అధ్యక్షుడు కావాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. (Donald Trump)

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూడేళ్లపాటు న్యూయార్క్‌లో ఏ వ్యాపార సంస్థకు డైరెక్టర్‌గా కానీ, ఉన్నతాధికారిగా కానీ వ్యవహరించకూడదని న్యూయార్క్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్‌ ఎంగొరన్‌ తీర్పుఇచ్చింది. న్యూయార్క్‌లోని బ్యాంకుల నుంచి ట్రంప్‌ రుణాలు తీసుకోకూడదనీ, ట్రంప్‌.. ఇతర నిందితులు కోట్ల డాలర్ల జరిమానాలు కట్టాలని ఆదేశించారు. ట్రంప్‌ కార్పొరేషన్‌ తప్పుడు లెక్కలు చెప్పకుండా చూడటానికి ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు.

ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం జరిమానాతో సరిపెట్టడం చెప్పుకోగదగ్గ పరిణామం.లేదంటే ట్రంప్ కంపెనీలన్నింటినీ మూసివేయాల్సి వచ్చేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ కంపెనీలన్నింటినీ కోర్టు మూసివేసే ప్రమాదం తప్పినా ట్రంప్‌, ఆయన కుమారులు, ఆర్థిక సలహాదారుకు జరిమానాల మోత మోగిపోయింది.

అక్రమంగా లబ్ధి పొందినందుకు మాజీ అధ్యక్షుడు 35.5 కోట్ల డాలర్ల జరిమానా కట్టాలి. ఆయన వ్యాపారాలను నడిపినందుకు కుమారులిద్దరూ చెరో 40 లక్షల డాలర్ల చొప్పున, ఆయన మాజీ ప్రధాన ఆర్థిక అధికారి 10 లక్షల డాలర్లు జరిమానాగా చెల్లించాలి. ట్రంప్‌ ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో 8.8 కోట్ల డాలర్ల జరిమానా కట్టాల్సి ఉంది. ఇతర మోసాల ద్వారా ఆర్జించిన ధనంపై 10 కోట్ల డాలర్ల వడ్డీనీ ఆయన కట్టాల్సి ఉంది. కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటూనే ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక అమెరికా అధికార పీఠాన్ని మ‌రోసారి ద‌క్కించుకోవాల‌ని తీవ్రంగా కృషిచేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం ఆయ‌న భారీగా డొనేష‌న్లు సేక‌రిస్తున్నారు. రిప‌బ్లిక‌న్ ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ప్ర‌త్య‌ర్ధి ఎవ‌రైనా ఉన్నారంటే అది నిక్కీ హేలీ (Nikki Haley). అయిన‌ప్ప‌టికీ రిప‌బ్లికన్ల అధ్య‌క్ష అభ్య‌ర్ధిత్వ రేసులో ట్రంప్ ముందంజ‌లో ఉన్నారు. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్ధిత్వం కోసం మొత్తం 14 మంది బ‌రిలోకి దిగారు. చివ‌ర‌కు డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ మాత్ర‌మే మిగిలారు.