Raghunandan: ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి.. BJP నేత ఏమంటున్నారు?
Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఈరోజు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసాడు. సిద్ధిపేటలో ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఓ వ్యక్తి యూట్యూబర్‌ని అంటూ ప్రభాకర్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి కత్తితో కడుపులో పొడిచాడు. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
అయితే ఈ ఘటన వెనుక BJP అభ్యర్ధి రఘునందన్ రావు (raghunandan rao) హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రఘునందన్ దిష్టిబొమ్మను నడిరోడ్డుపై ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు దహనం చేసారు. దీనిపై రఘునందన్ రావు స్పందిస్తూ.. ప్రభాకర్ రెడ్డిపై దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో తెలియాలంటే CBI విచారణ చేపట్టాల్సిందేనని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల పోల్ కోడ్ అమల్లో ఉంటే BRS కార్యకర్తలు తన దిష్టిబొమ్మను దహనం చేస్తున్నా పోలీసులు వారిని అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎక్కడ రానున్న ఎన్నికల్లో తాను గెలిచేస్తానో అన్న భయంతో BRS తనపై ఈ నిందలు వేస్తోందని వెల్లడించారు. నిందితుడికి రైతుబందు రావడంలేదని.. దీనికోసం పలుమార్లు ప్రభాకర్ రెడ్డిని రిక్వెస్ట్ చేసినా ఆయన సాయం చేయకపోవడంతో కోపంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని తెలిపారు.