BJP: కాంగ్రెస్ డిన్నర్ పార్టీలో ఎంజాయ్ చేసిన BJP నేతలు
ఏ పార్టీ అయినా పొత్తులు పెట్టుకుంటాయేమో కానీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉన్న కాంగ్రెస్, BJP పార్టీలు మాత్రం ఒకచోట ఉండవు.. కలవలేవు. అలాంటిది కాంగ్రెస్ (congress) నేత ఇచ్చిన డిన్నర్ పార్టీలో BJP నేతలు వెళ్లి ఎంజాయ్ చేస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకుంటుందా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేతలు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసారు.
ఈ పార్టీలో కర్ణాటక BJP ఎమ్మెల్యేలు సోమశేఖర్, శివరామ్ హెబ్బర్, ఎమ్మెల్సీ విశ్వనాథ్‌లు పాల్గొన్నారు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ ప్రతిపక్ష నేతలను కౌగిలించుకుంటూ పలకరించుకుంటూ ఉన్న ఫోటోలు బయటికి రావడంతో కర్ణాటక BJP అధ్యక్షుడు బీవై విజయేంద్ర మండిపడ్డారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shiva kumar) స్పందిస్తూ.. ఆ ముగ్గురూ తాను ఆహ్వానిస్తేనే వచ్చారని.. వారు డిన్నర్ చేసి వెళ్లిపోయారే తప్ప తమతో కలిసి ఎలాంటి మీటింగ్‌లో పాల్గొనలేదని సమర్ధించుకున్నారు.
2024లో లోక్ సభ ఎన్నికలు (lok sabha elections) జరగనున్న నేపథ్యంలో ఈ ముగ్గురినీ తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. 2019లో కాంగ్రెస్, JD(S) పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ముగ్గురు నేతలు బీజేపీ పార్టీలో చేరారు. దాంతో కాంగ్రెస్ ఓడిపోయి అధికారం భారతీయ జనతా పార్టీకి దక్కింది.
దాంతో విజయేంద్ర వెంటనే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ హైకమాండ్‌కు చేరవేసారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఇలా ప్రతిపక్ష పార్టీలకు చెందిన మీటింగులు, పార్టీలకు వెళ్లడం ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు.