బిహార్ సీఎం రిస్క్.. ఆ డాన్‌ను రిలీజ్ చేస్తారట!
Patna: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(nitish kumar) రిస్కీ నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో పేరు మోసిన డాన్, రాజకీయవేత్త అతీక్ అహ్మద్(atiq ahmed)ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం కాకముందే నితీష్ ఓ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న డాన్, రాజకీయవేత్త ఆనంద్ మోహన్ సింగ్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. 1994లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని కారులో నుంచి బయటికి లాగి దారుణంగా హత్య చేసిన ఆనంద్‌కు జీవితఖైదు పడింది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులను చంపినవారిని సత్ప్రవర్తన కింద విడుదల చేయడం అనేది కుదరదు. కానీ ఆనంద్‌ను విడుదల చేయించడానికి నితీష్ మార్పులు చేయించారట.
కేవలం ఆనంద్‌ను విడుదల చేయించడం కోసమే జైలు శిక్షల చట్టాల్లో మార్పులు చేయిస్తున్నారని మాజీ ఐపీఎస్ అమితాబ్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఆనంద్ తన కుమారుడి నిశ్చితార్థం నేపథ్యంలో పెరోల్‌పై బయటికి వచ్చాడు. మహాగట్బంధన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనంద్‌ను బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆనంద్ బయటికి వస్తే అటు జేడీ(యూ)కి ఇటు ఆర్జేడీకి లాభం చేకూరుతుంది. ఆనంద్ రాజ్‌పుత్ వర్గానికి చెందినవాడు. బిహార్‌లో ఈ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ అతను మంచి మాటకారి. అతన్ని వాడుకుంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే అవకాశాలు ఉన్నాయిని నితీష్ భావిస్తున్నారు. అందుకే ఆనంద్‌ను విడుదల చేయించాలని చూస్తున్నారు.
అయితే అతీక్ అహ్మద్ హత్య ఘటన నేపథ్యంలో మరో డాన్‌ను జైలు నుంచి విడుదల చేయించడం అనేది ఆలోచించాల్సిన విషయమని నిపుణుల అభిప్రాయం. ఆనంద్ సింగ్‌కు బయట ఎంతమంది శత్రువులు ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. అతను కూడా డాన్ కావడంతో ఎవరు ఎప్పుడు టార్గెట్ చేస్తారో చెప్పలేం. ఇలాంటి సమయంలో ఆనంద్‌ను రిలీజ్ చేయించాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటేనే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.