Caste Census: కుల గణనపై మాట మార్చిన కేంద్రం
కుల గణనపై (caste census) కేంద్రం స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. ఈరోజు కేంద్రమంత్రి అమిత్ షా (amit shah) కుల గణన గురించి మాట్లాడుతూ.. దీనికి ఎప్పుడూ తాము వ్యతిరేకం కాదని తెలిపారు. బిహార్‌లో కుల గణన చేపట్టినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) దానిని వ్యతిరేకించారు. కుల గణన పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇలా కుల గణనలకు పాల్పడటం మహా పాపం అని అన్నారు. ఇప్పుడు అమిత్ షా తాము కుల గణనకు వ్యతిరేకం కామని.. కాకపోతే సుదీర్ఘ చర్చలు జరిపాక దీనిపై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని తెలిపారు.
ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా కులగణనపై స్పందించారు. “” మాది జాతీయ పార్టీ. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడము. దీనిపై మేం బాగా చర్చలు జరిపి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. మేం కులగణనకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కాకపోతే ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు కులగణనకు పాల్పడితే అది చాలా తప్పు. త్వరలో దీనిపై మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం “” అని తెలిపారు.