Straight From Heart: అల‌సిపోయేలా ప్రేమించి అలుసైపోయా!

Hyderabad: ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించింది. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా త‌న‌తోనే జీవితం అనుకుంది. అల‌సిపోయేలా ప్రేమించి చివ‌రికి నేనే అలుసైపోయా అంటూ ఓ యువ‌తి త‌న క‌న్నీటి చుక్క‌ల‌తో మాకు పెట్టిన మెయిల్ ఈ క‌థ‌ (straight from heart).

ఆ అమ్మాయిది హైద‌రాబాద్. అబ్బాయిది క‌రీంన‌గ‌ర్. ఎవ‌రో ఇచ్చిన చెత్త స‌ల‌హాను న‌మ్మి ఆ అమ్మాయి టిండ‌ర్ యాప్ వేసుకుంది. అందులో ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆ కరీంన‌గ‌ర్ కుర్రాడు. మొద‌ట్లో కొత్త‌గా ఉంటుంది కాబట్టి బోలెడు క‌బుర్లు చెప్పుకునేవారు. అలా ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం ఏర్ప‌డింది. ఆ అమ్మాయికైతే మరీనూ. ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించేసింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ పాత ల‌వ్‌స్టోరీలో ఓ అమ్మాయి మోసం చేయ‌డంతో మ‌ళ్లీ ఎందుకు వ‌చ్చిన గొడ‌వ‌లే అని ఆ అమ్మాయి అంత కాక‌పోయినా 50% ప్రేమించాడు.

డేటింగ్ చేసి వ‌దిలేద్దాం అనుకున్నాడు కానీ.. పెళ్లి చేసుకోవాల‌ని ఉందని ఆ అమ్మాయి అనడంతో త‌నూ కాద‌న‌లేక‌పోయాడు. ఇంట్లో ఒప్పుకుంటేనే చేసుకుందాం అన్నాడు. అందుకు ఆ అమ్మాయీ స‌రేనంది. అబ్బాయి ఇంట్లో చెప్పి ఫొటోలు చూపించిన‌ప్పుడు అమ్మాయి బాగానే ఉంది కానీ ఆస్తి లేదు ఏమీ లేదు అవ‌స‌ర‌మా? అన్నారు త‌ల్లిదండ్రులు. ఆస్తి లేక‌పోతేనేం మంచి ఉద్యోగం చేస్తోంది అందులోనూ త‌న‌కు నేనంటే ప్రాణం అని ఒప్పించ‌డానికి ట్రై చేసాడు. అయినా వాళ్లు క‌ర‌గ‌లేదు. బ‌హుశా ఇంకాస్త గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఉంటే పెళ్లికి ఒప్పుకునేవారేమో.

కానీ ఆ అబ్బాయి ప్ర‌య‌త్నించ‌లేదు. ఇందుకు ఒక కార‌ణం ఉంది. చెప్ప‌గానే ఒప్పుకున్న‌ప్పుడు పెళ్లి చేసుకుంటేనే బాగా చూసుకుంటారని, ఫోర్స్ చేసి ఒప్పిస్తే పెళ్ల‌య్యాక మాట్లాడ‌కుండా ఉంటారేమోన‌ని ఆ అబ్బాయి భ‌య‌ప‌డ్డాడు. ఇదే విష‌యం అమ్మాయికి చెప్పాడు. అది విని ఆ అమ్మాయి ఒక్క‌టే మాట అనింది. పెద్ద‌లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలంటే అస‌లు ల‌వ్ మ్యారేజీలే ఉండ‌వు ఈ ప్ర‌పంచంలో అని. పెద్ద‌ల‌ది ఏముంది పెళ్ల‌య్యాక మ‌హా అంటే ఒక రెండు, మూడేళ్లు మాట్లాడ‌కుండా ఉంటారేమో. ఆ త‌ర్వాత ఏదైనా రోగం వ‌చ్చినా, ఇంటి పనులు చేయాల‌న్నా అదే కోడ‌లితోనే క‌దా చేయించుకునేది అని ఆ అబ్బాయిని క‌న్విన్స్ చేయ‌డానికి ట్రై చేసింది.

ఇందుకు ఆ అబ్బాయి స‌రే చూద్దాంలే అని చెప్పి రోజూ టైంపాస్ కోసం ఆ అమ్మాయికి ఫోన్లు చేస్తుండేవాడు. పాపం ఆ అమ్మాయి త‌న‌పై ప్రేమ‌తోనే చేస్తున్నాడేమో అనుకుని త‌న ఫోన్ కోసం ఎదురుచూసేది. ఇలా ఏడాది గ‌డిచిపోయింది. అమ్మాయి ఇంట్లో పెళ్లెప్పుడు అని ప్రెష‌ర్ ఎక్కువ అయిపోయింది. అటు ఆ అబ్బాయి ఇంట్లో మాట్లాడి ఒప్పించ‌డానికి క‌నీసం ధైర్యం కూడా చేయ‌లేక‌పోయాడు. పైగా ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోదాం అని ఆ అబ్బాయి అమ్మాయితో చెప్పాడు. ఇందుకు అమ్మాయి కూడా ఒప్పుకుంది. (straight from heart)

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. స‌డెన్‌గా ఆ అమ్మాయి చాట్ చేస్తూ ఎప్పుడైనా మిస్ యూ అని పెడితే.. మిస్ యూ టూ అని అనేవాడు కాదు. ఎందుకు అని అడిగితే.. ఇలా మిస్ యూ టూ, ల‌వ్యూ టూ అని చెప్పి నీపై మ‌రింత ప్రేమ పెంచుకోలేను అని అనేవాడు. దాంతో ఇక ఆ అమ్మాయికి అర్థ‌మైపోయింది. టైంపాస్ కోసమే చాటింగ్స్, కాల్స్ చేస్తున్నాడ‌ని నిజంగా ప్రేమ ఉన్న‌ప్పుడు త‌ను అడ‌గ‌క‌పోయినా ఎప్పుడో ఒక‌సారైనా ల‌వ్యూ అనో మిస్యూ అనో చెప్పేవాడు క‌దా అని. చివ‌రికి ఆ అమ్మాయి అనుకున్న‌దే నిజం అయింది.

ఏడాది పాటు చాట్స్, కాల్స్ మాట్లాడి ఇప్పుడేమో నాకోసం వెయిట్ చేసి నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు అనేసాడ‌ట‌. మ‌రి ఈ ముక్క ఇంట్లో వాళ్లు ఒప్పుకోన‌ప్పుడే చెప్పేసి ఉంటే ఆ అమ్మాయి క‌నీసం మ‌రిచిపోవ‌డానికి ప్ర‌య‌త్నించేది. త‌న‌తో చెప్పుకున్న ఊసులు, క‌బుర్లు గుర్తుచేసుకుంటూ ఆ అమ్మాయి క‌న్నీరుమున్నీర‌వుతోంది. అయినా ఆ అబ్బాయి మ‌న‌సు క‌ర‌గ‌లేదు. త్వ‌ర‌గా ఆ పిచ్చి పిల్ల అన్నీ మ‌ర్చిపోయి ప్ర‌శాంత‌మైన జీవితాన్ని అనుభ‌వించాల‌ని అంద‌రం కోరుకుందాం.

చివ‌రిగా ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే.. ఎవ‌రైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నువ్వుంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఇంట్లో ఒప్పించే ధైర్యం లేక‌పోతే ముఖం మీదే వ‌ద్ద‌ని చెప్పేయండి. అంతేకానీ ఇలా టైం పాస్ కోసం ఫోన్లు చేసి ఆశ‌లు రేపి చివ‌రికి పిచ్చివాళ్ల‌లా మార్చ‌కండి అంటోంది.