Health: ఆకలి మందగిస్తే ప్రమాదమా?
Health: ఇదివరకు బాగానే తినేవాడు ఇప్పుడు అసలు ఏమీ ముట్టడం లేదు.. ఆకలే లేదంటున్నారు.. ఇలాంటి మాటలు తరచూ ఇంట్లో వినిపిస్తుంటాయి. అమ్మ ఎప్పుడూ అంతే.. ఆకలేస్తే నేనే తింటా కదా అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఆకలి మందగిస్తోందంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని అంటున్నారు వైద్యులు. ఏదో వారంలో ఒకసారి ఆకలి వేయకపోతే ఫర్వాలేదు. రోజుల తరబడి అసలు ఆకలి వేయడం లేదు అంటే ఆలోచించాల్సిన అంశమే.
అసలు ఆకలి వేయకపోతే ఏమవుతుంది.. దాని అర్థం ఏంటి?
*ఆకలి మందగించింది అంటే జీర్ణాశయాంతర సమస్యలు (gastro intestinal) ఉండే అవకాశం ఉంది. అంటే కడుపులో పెప్టిక్ అల్సర్లు… దాని వల్ల కలిగే నొప్పి కూడా ఆకలిని మందగించేలా చేస్తాయి.
*థైరాయిడ్ గ్రంథి (thyroid gland) సరిగ్గా పనిచేయకపోయినా కూడా ఆకలి వేయదు. దీనిని హార్మోనల్ ఇంబాలెన్స్ అంటారు. వెంటనే వైద్యులను సంప్రదించి సమస్యకు పరిష్కారం తెలుసుకోకపోతే ముందు ముందు అది తీవ్ర అనారోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
*ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు ఉన్నా కూడా కొన్ని రోజుల పాటు ఏమీ తినకుండా అలా డీలా పడిపోతుంటారు. ఇలా డిప్రెషన్‌లో ఉన్నవారికి ఆకలి అసలే వేయదు. ఏదో తెలీని బాధలో ఉంటారు. వీరిని తప్పనిసరిగా వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాల్సిందే.
*క్షయ, వంటి సమస్యలు ఉన్నా కూడా ఆకలి వేయదు. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లతో ఈ సమస్య మొదలై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యకు దారితీస్తుంది.
*కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల కూడా ఆకలి మందగిస్తుంది. ముఖ్యంగా కడుపు, క్లోమ గ్రంథి క్యాన్సర్లు వచ్చినప్పుడు ఆకలి పూర్తిగా మందగిస్తుంది.
ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
రోజూ సమయానికి ఆకలి వేస్తూ.. ఒక వారం నుంచి అసలు ఆకలే లేకపోవడం. ఆ వారం కాస్తా రెండు, మూడు వారాలు దాటితే మాత్రం అనుమానించాల్సిన విషయమే. ఇలా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. సమస్యను ముందే గుర్తిస్తే త్వరగా నయం అవుతుంది.