రాత్రివేళల్లో చెమట పడుతోందా.. దీనికి అర్థమేంటి?
Sweating: నిద్రపోయేటప్పుడు చెమట పడుతోందంటే.. వేడి వాతావరణం వల్లో లేదా కరెంట్ పోవడం వల్లో అనుకుంటాం. నిజంగానే ఇవే కారణాలు అయితే ఫర్వాలేదు. కానీ వేడి ఉష్ణోగ్రతలు లేకపోయినా ఏసీ వేసుకుని పడుకున్నా కూడా నిద్రలో చెమలు పడుతుంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు వైద్యులు.
ఇలా రాత్రిళ్లు చెమట పట్టడాన్ని స్లీప్ హైపర్ హైడ్రోసిస్ (sleep hyperhidrosis) అంటారు. ఇది పెద్ద ప్రమాదకరం ఏమీ కాకపోయినప్పటికీ చూసీ చూడనట్లు మాత్రం వదిలేయకూడదట. దీనికి మూల కారణాలు మెనోపాజ్ (ఆడవారిలో), ఇన్ఫెక్షన్స్, ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు. క్షయ వ్యాధి, HIV ఉన్నవారికి కూడా ఇలా నిద్రలో చెమటలు పడుతుంటాయట. (sweating)
ప్రమాదకరమైన వ్యాధుల గురించి మాట్లాడుకునే ముందు సాధారణ అంశాల గురించి చర్చించుకుందాం. అంటే ఒక వ్యక్తికి రాత్రి నిద్ర సమయాల్లో చెమటపడుతోందంటే.. అతను ప్యానిక్కి గురవుతున్నాడని అర్థం. అంటే ఏదో తెలీని యాంగ్జైటీ. దీని వల్ల కూడా చెమటలు పడతాయి. ఇక రాత్రి వేళల్లో మందు తాగే అలవాటు ఉన్నా కూడా చెమటలు పడతాయి. మధుమేహం ఉన్నవారిలో రాత్రిళ్లు చెమటలు పట్టడం సాధారణమే. ఇందుకు కారణం బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం.
ఇవన్నీ సాధారణ కారణాలుగా పరిగణించవచ్చు. ఇక దీర్ఘకాల అనారోగ్య సమస్యలు కూడా ఇలా చెమటలు పట్టడానికి కారణం కావచ్చు. అంటే లింఫోమా వంటి క్యాన్సర్ ముప్పు ఉన్నవారికి ఇలా రాత్రిళ్లు చెమటలు పడుతుంటాయి. దాంతో పాటు ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. (sweating)
గుండె సమస్యలు
రాత్రి వేళల్లో చెమటలు పట్టడంతో పాటు ఉన్నట్టుండి దగ్గు రావడం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టే. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల గుండెకు సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా చెమటలు పడుతుంటాయి. నిర్లక్ష్యంగా ఉంటే నిద్రలోనే సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది.
ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
నిద్రలో రోజూ చెమటలు పడుతున్నప్పుడు.
మరీ దుస్తులు తడిసిపోయేలా చెమటలు పడుతున్నప్పుడు
రాత్రిళ్లు నిద్రపోలేకపోవడం
చెమటలు పట్టడంతో పాటు ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉన్నట్లు అనిపించడం.
పైన వివరించిన లక్షణాలు మీలో ఉన్నట్లైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. (sweating)