ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా..నిపుణులు ఏమంటున్నారు?
Brain Tumour: ఈరోజుల్లో మనకు ఫోన్ (mobile) అంటే శరీరంలో ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. ఇదివరకు ఏదైనా ఫోన్ కొనాలంటే డబ్బుల్లేని వారు కిడ్నీ అమ్ముకోవాలేమో అనుకునేవారు. ఇప్పుడు నిజంగానే కిడ్నీలు అమ్మి మరీ ఫోన్లు కొనుక్కుంటున్న రోజులివి. మనిషి పూట అన్నం లేకపోతే బతకగలడు కానీ ఫోన్ లేకపోతే బతకలేడు అనే స్థితికి వచ్చేసాం. అయితే ఈ ఫోన్ల వాడకం ఇప్పటికే పెరిగిపోయింది. ఇంకాస్త శ్రుతిమించితే బ్రెయిన్ ట్యూమర్లకు దారి తీసే అవకాశం లేకపోలేదు.
ముఖ్యంగా నిద్రపోయే ముందు ఫోన్లను పక్కనే పెట్టుకుని పడుకుంటే మరింత ప్రమాదం. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 4 వరకు బ్రెయిన్ ట్యూమర్ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ వాడకానికి బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఫోన్లు పక్కన పెట్టి పడుకోవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కానీ నివేదికలు కానీ లేవని అంటున్నారు అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్. (brain tumour)
కొన్ని రీసెర్చ్‌లు చేసినప్పుడు కూడా క్యాన్సర్ల రిస్క్ స్వల్పంగా ఉన్నప్పటికీ కచ్చితంగా ఫోన్ల కారణంగానే అని చెప్పలేమని అన్నారు. అలాగని ఫోన్లు ఇంకా వాడండి అని చెప్పడానికి కూడా లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం క్యాన్సర్ కారకాల్లో ఫోన్లు ఉన్నాయని పేర్కొంది. ఇక ఫోన్లు వాడకపోతే మనకు ప్రపంచం ముందుకు వెళ్లినట్లు ఉండదు కాబట్టి కనీసం హ్యాండ్స్ ఫ్రీ పరికరాలు వాడటం.. ఫోన్ కాల్స్ బదులు చాటింగ్ చేయడం.. నిద్రపోయే సమయంలో ఫోన్ ఒక ఆరు అడుగుల దూరంలో ఉంచడం ఉత్తమం అని డాక్టర్ సుధీర్ అంటున్నారు.