Health: ఇవి ఆరోగ్యానికి మంచివే.. కానీ రాత్రిళ్లు తిన‌కూడ‌దు

Health: కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను రాత్రివేళ‌ల్లో తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు నిపుణులు. అవి ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా రాత్రి వేళ‌ల్లో తింటే అనారోగ్యానికి దారి తీస్తాయ‌ట‌. అవి ఏ ఆహార ప‌దార్థాలో తెలుసుకుందాం.

పెరుగు (curd)

పెరుగు తింటే ఎన్ని లాభాలో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇందులో ఉండే ప్రో బ‌యోటిక్స్ జీర్ణాశ‌యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాక‌పోతే రాత్రిళ్లు పెరుగు తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే పెరుగు చ‌ల్ల‌గా ఉంటుంది కాబ‌ట్టి రాత్రి వేళ‌ల్లో తింటే ఊపిరితిత్తుల్లో క‌ఫం పేరుకునే అవ‌కాశం ఉంది. క‌డుపులో గ్యాస్ ఫాం అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

పండ్లు (fruits)

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజుకో పండు తినాల‌ని చెప్తుంటారు. కానీ రాత్రిపూట మాత్రం తిన‌కూడ‌దు. పండ్లు చ‌ల్ల‌ద‌నాన్ని ఇవ్వ‌డం అనేది వాటి స‌హ‌జ‌గుణం. రాత్రి వేళ‌ల్లో తింటే కఫం పేరుకుంటుంది. అదీకాకుండా పండ్లలో కార్బోహైడ్రేట్స్, షుగ‌ర్ ఉంటాయి కాబ‌ట్టి రాత్రి పూట బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగే ప్ర‌మాదం ఉంటుంది. రాత్రిపూట పండ్లు తింటే మ‌ల‌బ‌ద్ధ‌కం పెరుగుతుంది. అందుకే మ‌ధ్యాహ్నం లోపు తినేయ‌డం బెట‌ర్.

చికెన్ (chicken)

చికెన్‌లో అధిక శాతంలో ప్రొటీన్ ఉంటుంది. కాబ‌ట్టి అర‌గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. రాత్రి వేళ‌ల్లో చికెన్ తింటే అర‌గుద‌ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సరిగ్గా నిద్ర‌ప‌ట్ట‌దు. ఒక‌వేళ రాత్రి వేళల్లో చికెన్ తినాల్సి వ‌స్తే కొద్దిగా మాత్ర‌మే తినండి.

బ్ర‌కోలీ, కాలిఫ్ల‌వ‌ర్ (broccoli, cauliflower)

బ్ర‌కోలీ, కాలిఫ్ల‌వ‌ర్ వంటి వాటిల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి అర‌గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. రాత్రివేళల్లో వీటిని తింటే క‌డుపు ఉబ్బ‌డం, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.