Work From Home సైడ్ ఎఫెక్ట్స్

Hyderabad: కోవిడ్ పుణ్య‌మా అని వ‌ర్క్ ఫ్రం హోం (work from home) మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇంట్లో నుంచి ప‌ని చేసుకోవ‌చ్చు అనే విష‌యం కూడా అప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రికీ తెలీదు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి ప‌ని అనేది అమ‌ల్లోకి వ‌చ్చిందో అటు వ‌ర్క్ ఇటు ఫ్యామిలీని చూసుకునే ఛాన్స్ వ‌చ్చింద‌ని ఎంతో మంది చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఉద‌యాన్నే లేచి బాక్సులు క‌ట్టుకుని ట్రాఫిక్‌లో ప‌డి పోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దని సంతోషించారు.

కోవిడ్ త‌గ్గాక కూడా కొన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోంను కంటిన్యూ చేస్తున్నాయి. మ‌రికొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడ‌ల్‌ను తీసుకొచ్చాయి. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి రెండు రోజులు ఇంట్లో నుంచి ప‌నిచేసుకునే అవ‌కాశం అన్న‌మాట‌. అయితే వ‌ర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేస్తున్న‌వారిపై చేప‌ట్టిన స‌ర్వేలో తేలింది ఏంటంటే.. దీని వ‌ల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ‌ట‌. (work from home)

మాన‌సిక అనారోగ్యం
వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల చాలా మంది ఉద్యోగుల్లో మాన‌సిక అనారోగ్య స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ట‌. ఆఫీస్‌లో ఉంటే ప‌క్క‌నే కొలీగ్స్ ఉంటారు హాయిగా వారితో మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ వ‌ర్క్ చేసుకుంటారు. కానీ అవేమీ లేకుండా ఇంట్లో ఒంట‌రిగా కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఒంట‌రితనం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌.

అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్
వ‌ర్క్ ఫ్రం ఆఫీస్ స‌మ‌యాల్లో ఉద‌యాన్నే ప‌రుగులు పెడుతూ ఆఫీస్‌ల‌కు వెళ్లిపోతుంటారు. కానీ వ‌ల్ల క‌నీసం శ‌రీరానికి ప‌ని చెప్ప‌గ‌లుగుతారు. అదే ఇంట్లో నుంచి ప‌ని అంటే ఉద‌యం 10 దాకా ప‌డుకుని 10:15 క‌ల్లా మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి టిఫిన్, కాఫీ అన్నీ బెడ్ మీద‌కే తెచ్చుకుని వ‌ర్క్‌లో మునిగిపోతుంటారు. ఇక శ‌రీరానికి కావాల్సిన యాక్టివిటీ ఎలా వ‌స్తుంది? దీని వ‌ల్ల ఒబెసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, డ‌యాబెటిస్ వ‌స్తాయి. (work from home)

విట‌మిన్ డి లోపం
క‌నీసం ఆఫీస్‌కి వెళ్లే స‌మ‌యంలో బ‌య‌టికి వ‌స్తాం కాబ‌ట్టి సూర్య కిర‌ణాలు ఒంటికి త‌గిలి విట‌మిన్ డి అన్నా ల‌భిస్తుంది. అదే ఇంటి నుంచి ప‌ని అంటే ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుండిపోతాం. దీని వ‌ల్ల ఒంట్లో విట‌మిన్ డి ప్రొడ‌క్ష‌న్ ఆగిపోతుంది. దాని వ‌ల్ల కాల్షియం లెవెల్స్ కూడా డ్రాప్ అయిపోతాయి.

మోటివేష‌న్ ఉండ‌దు
క‌నీసం ఆఫీస్‌లో ఉంటే ఖాళీగా కూర్చుంటే బాగోదని ఏదో ఒక ప‌నిని క‌ల్పించుకుని చేస్తుంటారు. ఒక‌వేళ ప‌నిచేయ‌డం బ‌ద్ధ‌కంగా అనిపించాన మోటివేట్ చేయ‌డానికి యాక్టివిటీస్ ఉంటాయి. అదే ఇంట్లో ఉంటే ఇచ్చిన ప‌నిని కూడా స‌రిగ్గా చేయ‌బుద్ధి కాదు. దీని వ‌ల్ల కెరీర్ గ్రోత్ ఆగిపోయే ప్ర‌మాదం ఉంది. (work from home)