Pimples: మొటిమలపై కన్నేయండి.. క్యాన్సర్ కావచ్చు!
Hyderabad: ఓ 50 ఏళ్ల వయసు ఉన్న మహిళకు ముక్కుపై మొటిమ(pimple) వచ్చింది. వేడి వల్ల అయ్యి ఉంటుంది పోతుందిలే అని వదిలేసింది. కానీ కొన్ని రోజులైనా అది పోలేదు. దాంతో గిల్లి చూసింది. చీము, బ్లడ్ కారడంతో ఇది సాధారణ పింపుల్‌లా లేదని వెంటనే డాక్టర్లను సంప్రదించింది. అది పింపుల్ కాదు.. స్కిన్ క్యాన్సర్ అని తెలిసి షాకైంది. అమెరికాకు చెందిన ఆ మహిళ ముక్కుకు సర్జరీ చేసి ట్యూమర్‌ను తీసేసారు. మళ్లీ స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండడంతో నెల నెలా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. దాంతో మొటిమలపై కూడా ఓ కన్నేసి ఉంచాలని డెర్మటాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.
ఆ మహిళకు బేసల్ సెల్ కార్సినోమా(basal cell carcinoma) వచ్చింది. ఇలాంటి అరుదైన క్యాన్సర్లు.. ఎండ ఎక్కువగా ఏ శరీర భాగంపై పడుతుందో ఆ భాగంలో మొటిమలా వచ్చి క్యాన్సర్‌లా మారతాయి. కాబట్టి బయటికి వెళ్లే 15 నిమిషాల ముందు ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలపై బాగా సన్‌స్క్రీన్ రాయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి కోసం నేచురల్ సన్‌లైట్ కావాలనుకునేవారు.. తెల్లవారుజామున లే లేత కిరణాలు శరీరానికి తగిలేలా 10 నిమిషాలు నిలబడితే చాలని చెప్తున్నారు. కాబట్టి మహిళలూ.. మొటిమలు అసహజంగా అనిపించినా, లేదా ఎప్పుడూ లేని విధంగా శరీరంపై మచ్చలు ఏర్పడినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.