Pneumonia: చలికాల శత్రువు
pneumonia: అసలే చలికాలం.. ఈ సీజన్లో రోగాలు కూడా ఎక్కువే. సాధారణ జర్వాలు, జలుబు దగ్గు విపరీతంగా ఉంటాయి. వీటిని మించి నుమోనియా వంటివి వస్తే అస్సలు భరించలేం. కాబట్టి ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ వస్తే నుమోనియా బారినపడతాం. ఇది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ల వల్ల ఈ నుమోనియా సోకుతుంది. చలికాలంలో మీకు ఛాతి మరీ బిగుతుగా ఉన్నట్లు కానీ దగ్గు, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. తగ్గిపోతుంది అనే నిర్లక్ష్యంతో వదిలేస్తే ఊపిరితిత్తుల్లో నిమ్ము పేరుకుపోతుంది. అప్పుడు వైద్యులను సంప్రదించినా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. (pneumonia)
దీనికి అసలు చికిత్సలే లేవా అంటే ఉన్నాయి. కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కోలుకుంటున్న సమయంలోనూ ఏదో భారాన్ని మోస్తున్నట్లు ఉంటుంది. ఇది కేవలం పిల్లలు, పెద్దలకు మాత్రమే వస్తుంది కదా అని మధ్య వయసు వారు, యువత తేలికగా తీసుకోవడానికి లేదు. జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటే వయసు తేడా లేకుండా అందరినీ కబళించేస్తుంది ఈ నుమోనియా.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండండి.
మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉంటే వారికి దూరంగా ఉండండి
మాస్కులు ధరించండి. ఎందుకంటే కాలుష్యం వల్ల కూడా ఈ వ్యాధి సోకచ్చు
ఈ చలికాలం ముగిసే వరకు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది.
మీకు వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లే అలవాటు లేకపోతే కనీసం రోజూ 30 నిమిషాల పాటు కాస్త వేగంగా నడిచేందుకు ప్రయత్నించండి.