Relationship: మీ ప్రేమ బంధంలో అనుమానాలు ఉన్నాయా?

ప్రేమ బంధంలో అయినా వైవాహిక జీవితంలో (relationship) అయినా ముందుగా ఇద్ద‌రి మ‌ధ్య ఉండాల్సింది ప్రేమ‌, అనురాగం, న‌మ్మ‌కం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి త‌క్కువైనా ఆ బంధం బీట‌లు వారుతుంది. ఒక‌వేళ మీ బంధంలో మీకు అనుమానాలు ఉన్నాయ‌ని అనిపిస్తే ఏం చేయాలో చూద్దాం.

ఒకటి గుర్తుంచుకోండి.. అనుమానాలు ఉన్నాయంటే దాన‌ర్ధం ఆ బంధానికి గుడ్‌బై చెప్ప‌మ‌ని కాదు. అసలు ఆ అనుమా నం ఎక్క‌డి నుంచి మొద‌లైంది.. ఏ విష‌యంలో క‌లుగుతోందో చూసుకోండి. ఒక‌వేళ మీ పార్ట్‌న‌ర్ మ‌రొకరితో ర‌హ‌స్యంగా మాట్లాడుతున్న‌ట్లు అనిపిస్తోందా? అయితే వారినే నిదానంగా అడిగి చూడండి. మీకున్న కోపాన్నంతా చూపించేసి అరిచేయ‌డం చేతులెత్త‌డం వంటివి అస్స‌లు వ‌ద్దు. నిజం తెలీకుండా తొంద‌ర‌ప‌డితే ఆ త‌ర్వాత ఎంతో బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది.

మీరు ఉన్న బంధంలో మీ పార్ట్‌న‌ర్ స‌రైన వ్య‌క్తేనా అన్న అనుమానాలు ఉన్నాయా? దీని గురించి మీరు మీ ప్రేమ విష‌యాన్ని వ్య‌క్త ప‌ర‌చ‌డానికి ముందు ఆలోచించుకోవాలి. అన్నీ న‌చ్చితేనే క‌దా అవ‌తలి వ్య‌క్తికి ప్ర‌పోజ్ చేస్తారు. తీరా ప్రపోజ్ చేసాక స‌రైన పార్ట్‌న‌రేనా కాదా అని ఆలోచించ‌డంలో అర్థంలేదు. అయినా కూడా మీకు ఆ డౌట్స్ వస్తున్నాయంటే ద‌య‌చేసి ఆ డౌట్ల‌ను మీ పార్ట్‌న‌ర్‌తో చ‌ర్చించ‌కండి. మీకు మీరు ముందు ఓ అంచ‌నాకు రండి. లేదంటే ఇలాంటి విష‌యాల్లో సాయం చేయ‌డానికి ప్రొఫెష‌న‌ల్స్ ఉంటారు. వారి సాయం తీసుకోవ‌చ్చు.