Health: పెద్దలు చెప్పింది వినకండి
Health: ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి టాపిక్ వస్తే మన పూర్వీకులు, పెద్దలు మంచి తిండి తిని ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించేవారు అంటుంటారు. అది నిజమే. కానీ ఈ మధ్యకాలంలో 103 ఏళ్లు, 113 ఏళ్లు దాటినా ఇంకా జీవించి ఉన్నవారి వద్దకు వెళ్లి మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని అడిగితే.. వారు వారికి తోచింది చెప్పేస్తున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన 102 ఏళ్ల బామ్మను నీ ఆరోగ్య రహస్యం ఏంటి బామ్మా అని అడిగితే.. నేను సిగరెట్ తాగుతాను, డ్రింకింగ్ కూడా చేస్తాను అని చెప్పి అందరినీ షాక్‌కి గురిచేసింది. దాంతో కొందరు బుద్ధిలేని వారు సిగరెట్, ఆల్కహాల్ తాగితే ఎక్కువ కాలం బతికే ఉంటారు అనుకుంటూ లేని అలవాట్లను కూడా అలవాటు చేసేసుకుంటున్నారు.
ఇది చాలా తప్పు. కొందరి అదృష్టం బాగుండి వారు వందేళ్లకు మించి బతుకుతుండచ్చు. ఇంకొందరికి జీన్స్ వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం రావచ్చు. వారు అన్నేళ్లు బతుకుతున్నారు కదా అని వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుని వాటిని మనమూ పాటించాలని అనుకోవడం పొరపాటు. అందుకే అలాంటి పెద్దల మాట నమ్మకండి అని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తుంటే ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉన్నాయి. అంతేకానీ.. 100 ఏళ్లకు పైగా వయసున్న వారు ఫలానా తిండి తింటున్నారని.. ఫలానా తాగుడు అలవాటు ఉంది కదా అని మనం కూడా అదే ఫాలో అవుతాం అంటే మొదటికే మోసం అని గుర్తుంచుకోవాలి.