ఇంకెన్నాళ్లు సింగిల్ కింగ్‌లం అనిపించుకుంటారు?
Relationship: 2024 వచ్చేసింది. ఇన్నాళ్లూ సింగిల్ కింగులం అనిపించుకుంటారు. అలాగని ఎవరిని పడితే వారిని ప్రేమించేసి పెళ్లి చేసుకోమని చెప్పడంలేదు. అలాగని ప్రేమించండి, పెళ్లి చేసుకోండి అని బలవంతం అస్సలు పెట్టడంలేదు. కాకపోతే ప్రేమ విషయంలో ఎలా వ్యవహరించాలో తెలీక సింగిల్‌గా ఉండిపోతున్న వారికోసం కొన్ని టిప్స్. ఈ టిప్స్ అబ్బాయిలకే కాదు సింగిల్ క్వీన్స్‌కి కూడా వర్తిస్తుంది.
నెగిటివ్ ఆలోచనలు వద్దు
ఈ జనరేషన్లో స్వచ్ఛమైన ప్రేమ దొరకదు. అందరూ వారి స్వలాభాల కోసమే ప్రేమిస్తుంటారు అనుకునేవారు చాలా మంది ఉంటారు. ఇది తప్పు. ఎవరో ఎక్కడో ఏదో చేసారని అందరినీ తప్పుబట్టడం చాలా తప్పు. మీపై మీకు కూడా నెగిటివిటీ ఉండకూడదు. నేను అవతలి వ్యక్తికి సరిపోనేమో. నేను బాగా చూసుకోలేనేమో.. ఇలాంటి ఆలోచనలతోనే ఏజ్ బారైపోతుంటుంది. ముందు ప్రయత్నిస్తే కదా తెలిసేది.
పాత ఫ్రెండ్స్‌కి ఒకసారి హాయ్ చెప్పండి
మీరు స్కూల్ లేదా కాలేజీ రోజుల్లో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు టచ్‌లో ఉండి ఉండకపోవచ్చు. కెరీర్ పరంగా వారు వేరే దారులు చూసుకుని ఉండొచ్చు. ఫర్వాలేదు. ఒకసారి పలకరించి చూడండి. వారి ద్వారా మీకు కొత్త వ్యక్తులు, పరిచయాలు ఏర్పడతాయేమో..! ఇప్పుడొస్తున్న డేటింగ్ యాప్స్ కంటే ఫ్రెండ్స్ బెటర్ కదా. కనీసం వారు మంచివారో కాదో ముందే తెలిసిపోతుంది.
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి
మీ గదుల్లో అలా టీవీనో లేదా సినిమానో చూస్తూ కాలక్షేపం చేసేస్తుంటారు చాలా మంది. నిజానికి ఇది కూడా ఒక రకమైన కాలక్షేపమే. ఇంట్రోవర్ట్స్కి దీనిని మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. కానీ మీరు అవకాశం ఉన్నప్పుడల్లా చక్కగా తయారై బయటికి వెళ్తూ ఉండండి. మీకు మంచి పార్ట్నర్ కావాలి అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చుని కలలు కంటుంటే ప్రత్యక్షమైపోరు కదా..!
ఈ టిప్స్ నిజాయతీగా ప్రేమలో పడాలనుకునేవారికోసమే. టైం పాస్ బ్యాచ్, ఓయో బ్యాచ్‌ల కోసం కాదని గమనించగలరు.