World Diabetes Day: ఈ అపోహలు తెలుసుకోవాల్సిందే..!
World Diabetes Day: అన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు మధుమేహం వల్లే వస్తాయంటుంటారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. సాధారణ మధుమేహం కంటే డయాబెటిక్ నెఫ్రోపతీ, కార్డియో వంటివి మరింత డేంజర్. కళ్లు పోవడం, కిడ్నీలు పోవడం, గుండెపోటు రావడానికి ఇదే మూలకారణం. ఈరోజు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా అసలు ఈ వ్యాధి గురించి మనకు ఎంత వరకు అవగాహన ఉందో నిజాలేవో అపోహలేవో తెలుసుకుందాం.
డయాబెటిక్ పేషెంట్లు వ్యాయామాలు చేయకూడదా?
ఇదో అపోహ. డయాబెటిక్ పేషెంట్లు వ్యాయామం చేయకూడదని అలా చేస్తే షుగర్ లెవెల్స్ పడిపోతాయని అంటుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు ప్రముఖ ఫిజిషియన్ దిలీప్ గూడె (dilip gude). నిజానికి మంచి వ్యాయామం షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని అంటున్నారు. ఎక్కువగా కార్డియో వ్యాయామాలు రెసిస్టెన్స్ ట్రైనింగ్ డయాబెటిక్ పేషెంట్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందట. (World Diabetes Day)
షుగర్ ఎక్కవ తింటే డయాబెటిస్ వస్తుందా?
అలాగని ఏమీ లేదు. షుగర్ ఎక్కవగా తినేవారికి డయాబెటిస్ రాదు కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం చెక్కర తినకూడదు. అయితే డయాబెటిస్ ఉన్నా లేకపోయినా వైట్ షుగర్‌కి దూరంగా ఉంటే మున్ముందు అనారోగ్యాలకు చెక్ పెట్టచ్చు. కావాలంటే చెక్కరకు బదులు బెల్లం వాడుకుంటే మంచిది.
ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికీ షుగర్ లేదు కాబట్టి మనకూ రాదా?
అలాగని ఏమీ లేదు. అదృష్టం బాగోలేకపోతే మన జీవనశైలి సరిగ్గా లేకపోయినా షుగర్ వస్తుంది. బీఎంఐ ఎక్కువగా ఉండటం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
షుగర్ వ్యాధి అదుపులోనే ఉంది కాబట్టి ఏడాదికి ఒకసారి చెకప్ చేయించుకోవాలా?
అలా కుదరదు. ఎందుకంటే డయాబెటిస్ అనేది చాప కింద నీరులాంటిది. అదుపులోనే ఉంది కదా అని ఏడాదికి ఒకసారి చెకప్ చేయించుకుంటాం అంటే కుదరదు. ఎందుకంటే అప్పటికే అది కిడ్నీలకో గుండెకో కంటికో డ్యామేజ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టేసి ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు అది కంట్రోల్‌లో ఉన్నప్పటికీ ప్రతి మూడు నెలలకు ఓసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. (World Diabetes Day)