EXCLUSIVE: భవిష్యత్తు మిల్లెట్లదే..!
EXCLUSIVE: రాబోయే కాలంలో ఇక మిల్లెట్ల (తృణధాన్యాలు) హవానే నడుస్తుందని అంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్, టాలీవుడ్ నటుడు భరత్ రెడ్డి (bharat reddy). మిల్లెట్ మార్వెల్స్ పేరిట ఆయన పలు క్లౌడ్ కిచెన్‌లు కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఇక తెల్ల బియ్యాన్ని పక్కన పెట్టి రోజులో కనీసం ఒక్క పూటైనా మిల్లెట్లతో చేసిన భోజనం చేయాలని భరత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
ఏదీ ఆర్గానిక్ కాదు
ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్న పదం ఆర్గానిక్. ఆర్గానిక్‌గా పండించిన కూరగాయలు, పండ్లు తినడానికే ప్రజలు ఇష్టపడతారు. కానీ అందరికీ ఆ స్థోమత ఉండదు. ఎందుకంటే ఆర్గానిక్ కూరగాయలు, పండ్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే మిల్లెట్లతో ఆ బాధ ఉండదని అంటున్నారు భరత్ రెడ్డి. అయితే తమ కిచెన్‌లోకి వచ్చే మిల్లెట్లు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి కాదని.. నిజానికి భారతదేశంలో అసలు ఆర్గానిక్‌గా పండించేవి ఏవీ కూడా లేవని చెప్తున్నారు. కాకపోతే సాధారణ ధాన్యాలతో పోలిస్తే మిలెట్లకు పెద్దగా రసాయనాలు అవసరం కూడా ఉండవని అంటున్నారు.
ఖాదర్ వలీ సహకారంతో
మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన ఖాదర్ వలీ (khader vali) సహకారంతోనే ఈ మిల్లెట్ మార్వెల్ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించామని తెలిపారు భరత్ రెడ్డి. మిల్లెట్ మార్వెల్ పేరిట వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మిల్లెట్లు తినడం వల్ల కలిగే లాభాలను వివరించడంతో పాటు తక్కువ ధరలకే రకరకాల తృణధ్యానాలను అమ్ముతున్నారు. మిల్లెట్ మార్వెల్ ఫ్రాంచైస్‌లు హైదరాబాద్‌లోని మణికొండ, ఫిలిం నగర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లలో ఉన్నాయి.