Painkillers: మందులే ముంచుతున్నాయ్..!
Painkillers: తలనొప్పి వచ్చినా ఇతర ఏ సాధారణ నొప్పులు వచ్చినా ముందుగా మనం చేసే పని చకచకా ఒక పెయిన్ కిల్లర్ తీసి వేసేసుకోవడం. కొన్ని నిమిషాల్లోనే అది మనకు నొప్పి నుంచి సాంత్వన కలిగిస్తుంది. చాలా మంది అత్యంత ఎక్కువగా పెయిన్ కిల్లర్ దేనికి వాడుతున్నారంటే తలనొప్పికి. తలనొప్పి వచ్చిందంటే మాత్ర పడందే అది పోదు. ఆ తలనొప్పితో మనిషి ఏమీ చేయలేడు. ముఖ్యంగా మైగ్రేన్ నొప్పి. మైగ్రేన్ నొప్పి ఆల్మోస్ట్ గుండెపోటు సమయంలో వచ్చే నొప్పితో సమానంగా ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఆ మైగ్రేన్ తలనొప్పి ఒక్కసారి వచ్చిందంటే దాదాపు మూడు రోజుల పాటు తగ్గదు. కొన్నిసార్లు పెయిన్ కిల్లర్లు వాడినా పనిచేయదు.
చాలా మంది అలా తలనొప్పి స్వల్పంగా వస్తోందని తెలిసినా వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. ఇదివరకు తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్లు వేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పెయిన్ కిల్లర్లే తలనొప్పులకు కారణం అవుతున్నాయని పరిశోధనల్లో తేలింది. వారంలో 3 సార్లకు మించి ఎక్కువ పెయిన్ కిల్లర్లు వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం మార్కెట్‌లో సాధారణంగా లభించే పెయిన్ కిల్లర్లు ఇబుప్రోఫెన్, ఆస్ప్రిన్, ఎసీటమినోఫెన్, ట్రిప్టన్స్, ఓపియోడ్స్, ఇతర పెయిన్ బామ్స్ ఉన్నాయి. వీటి అతి వినియోగం వల్లే తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి.
ఒకవేళ తలనొప్పి మాత్ర వేసుకున్నాక కూడా మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోందంటే దానికి ఒక కారణం మీరు అతిగా వాడుతున్న పెయిన్ కిల్లర్లే. మీకు ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. వారు పెయిన్ కిల్లర్స్ వాడకం లేకుండా ఇతర ట్రీట్మెంట్లను సజెస్ట్ చేస్తారు.