Bhogapuram Airport: ఉద్యోగాల ఉత్తరాంధ్రగా మారుస్తాం: సీఎం జగన్
vijayanagaram: ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే.. వలసలు గుర్తుకువచ్చేవని… కానీ నేడు.. ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు అని గుర్తుకు వచ్చేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక బుధవారం నాడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. అనంతరం సవరవల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును మరో 24 నుంచి 30 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సహాయ సహకారాలతోపాటు, జీఎంఆర్ సంస్థ చేయూతతో.. విమానాశ్రయాన్ని మొత్తం మూడు దశల్లో దీన్ని అభివృద్ధి చేయనుందన్నారు. మొత్తం 1.80 కోట్ల మంది ఇక్కడి నుంచి ప్రయాణించేలా దీన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఒకేసారి ఇరవైకి పైగా విమానాల్లోంచి ప్రయాణికులు దిగేలా 22 ఏరో బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకురానున్నామని, ఇది పూర్తయ్యే నాటికి భోగాపురం నుంచి విశాఖ వరకు అన్ని రంగాలతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇక విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు 500 ఎకరాల్లో ఏరో సిటీ అభివృద్ధి చేయనుంది. దీన్ని ఐటీ పార్కులు, ఇతర ప్రాజెక్టులకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
ఈత కొడుతున్న మత్స్యం ఆకారంలో నిర్మించనున్న ఎయిర్‌పోర్టు నమూనాను నిర్మాణ సంస్థ జీఎంఆర్ తయారు చేసింది. దీని నిర్మాణానికి సుమారు.. రూ. 4,592 కోట్ల వెచ్చించనున్నారు. ఇక రూ.21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్), రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులకు, విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా ఇవాళ సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు.