Vande Bharat Express: త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు!
Hyderabad: తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ (vande bharat express) పరుగులు పెట్టనుంది. ఇప్పటికే రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు రైల్వే అధికారులు. ఇక తాజాగా.. మరో వందేభారత్ (vande bharat express) రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇది సికింద్రాబాద్ నుంచి బెంగళూరు (Banglore) రూట్లో ఈ కొత్త రైలును తీసుకొచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అయితే.. ఏ మార్గంలో ఈ రైలు ప్రయాణించాలి.. టిక్కెట్టు ధర ఎంత ఉండాలి అన్న అంశాలపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు సమాచారం.
బెంగళూరుకు రెండు రూట్లు ఉన్నాయి..
సికింద్రాబాద్ (secunderabad) నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు వరకు వందేభారత్ రైలును అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు వాస్తవానికి రెండు రూట్లున్నాయి. వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా ఒకటి ఉండగా… మరొకటి.. మహబూబ్నగర్ (mahboobnagar), కర్నూలు (kurnool), గుంతకల్లు మీదుగా ఇంకో మార్గం ఉంది. అయితే.. ఈ రెండో మార్గం వైపే రైల్వే శాఖ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్-బెంగళూరు మధ్య ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ.. తెలంగాణ ప్రజలు తిరుమలకు నిత్యం పెద్దసంఖ్యలో వెళుతుంటారని, అందుకే… ముందు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి (Kishan reddy) పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తొలుత సికింద్రాబాద్- తిరుపతి మధ్య రైలును ఇటీవల ప్రారంభించారు. ఇక కర్ణాటకలో (karnataka assembly elections) అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. త్వరలోనే వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తే.. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.