బోర్డు పరీక్షల విధానంలో మార్పులు ఇవే!
నూతన విద్యావిధానం(2020)లో భాగంగా వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షల విధానం, సబ్జెక్టుల ఎంపిక విధానంలో పలు మార్పులు కోరుతూ.. కేంద్రం ముసాయిదాను సిద్దం చేసింది. అందులో పేర్కొన్న కొన్ని సంస్కరణల ప్రకారం.. 11, 12 తరగతలు చదివే విద్యార్థులకు ఏడాదికి ఒకసారి పరీక్షలు నిర్వహించే విధానం కాకుండా.. ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు ప్రీస్కూల్ నుంచి 2వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా.. మూడో తరగతి నుంచి రాత పరీక్షలు నిర్వహించాలని సూచిస్తోంది. విద్యార్థుల మూల్యాంకనం కూడా మరింత సీరియస్గా సాగాలని సూచించారు. ఈ మేరకు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఎఫ్) ముసాయిదాను సిద్ధం చేసింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలతో తయారు చేసిన ఈ ముసాయిదాలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి..
సబ్జెక్టుల ఎంపికలో నూతన విధానం..
ఇప్పటి వరకు 11, 12 తరగతుల విద్యార్థులకు అమలవుతున్న సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్ విభాగాల విధానం కాకుండా నూతన సబ్జెక్టులను ఇకపై తీసుకురానున్నారు. వాటి స్థానంలో వొకేషనల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్, సైన్స్, హ్యుమానిటీస్, మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే ఎనిమిది సబ్జెక్టులను ప్రవేశపెడతారు. వీటిలో కొన్నింటిని విద్యార్థి తన అభిరుచికి తగ్గట్టు ఎంచుకోవచ్చు. 11 మరియు 12 తరగతులలో, విద్యార్థులు కనీసం మూడు పాఠ్యాంశాల నుండి విభాగాలను ఎంచుకోవాలి… ప్రతి విభాగంలో నాలుగు కోర్సులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక రెండు విడతలుగా 11, 12 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి సమయం కలిసి వస్తుందని… విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇదివరకే సీబీఎస్ పాఠశాలల్లో కరోనా పాండమిక్ సమయంలో రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఎప్పటి లాగే వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త విధానాలపై ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఈ విధానాన్ని 2024 నుంచి అమలు చేయాలని విద్యా శాఖ భావిస్తోంది.