‘బలగం’ కథ నాదే.. పబ్లిసిటీ కోసమే వివాదం‌‌: వేణు

వెండితెరపై కమెడియన్​గా గుర్తింపు తెచ్చుకున్న వేణు దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘బలగం’. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్​తో బాగా పాపులర్​ అయినప్పటికీ అంతకుముందే ప్రభాస్ మున్నా చిత్రంలో టిల్లుగా నటించి టిల్లు వేణుగా గుర్తింపు పొందారు. అతిథి వంటి పలు చిత్రాల్లో నటించిన వేణు బుల్లితెరపైనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల రచయిత, దర్శకుడిగా మారి దిల్​ రాజు నిర్మాతగా బలగం అనే ఫ్యామిలీ డ్రామాని తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం తదితర తారాగణంతో ఈ సినిమా మార్చి 3వ తేదీన రిలీజైంది. సినీ విమర్శకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ తనదంటూ, పూర్తి క్రెడిట్​ తనకే ఇవ్వాలంటూ జర్నలిస్ట్​ సతీష్​ మీడియా వేదికగా ఆందోళన చేశారు. ఈ విషయంపై తాజాగా వివరణ ఇచ్చారు వేణు ఎల్దండి.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ‘మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నవాళ్లు ఆరుగురు సంతానం. ముగ్గురు మేనత్తలు, ముగ్గురు పెద్దమ్మలు, ముగ్గురు మేనమామలు. మా కుటుంబం అంతా కలిపితే 100కి పైగానే ఉంటాం. తెలంగాణలో పెళ్లైనా, చావైనా పండగే. మా నాన్న గారు చనిపోయినప్పుడు అందరూ వచ్చారు. బాధల్లో ఉన్నోళ్లకు ఇంత మందు తాగిపించి వారి బాధను పంచుకోవడమనే కాన్సెప్ట్​ తెలంగాణలో తరతరాల నుంచీ వస్తున్న సంప్రదాయం. నాకప్పుడు 18-19 ఏళ్లుంటాయి. అవన్నీ చూసి చాలా కొత్తగా అనిపించింది. చావులో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా? అని అప్పటి నుంచి నా మైండ్ లో వందల ఆలోచనలు మొదలయ్యాయి. నా రెండో పెద్ద నాన్న చనిపోయిన 15 రోజులకే పెద్దమ్మ చనిపోయింది. నేను అప్పుడు సినిమాలతో బిజీగా ఉండి వెళ్లలేకపోయాను. తెలంగాణలో బుడగ జంగమలు మన పెద్దలు చనిపోయినప్పుడు పాట పాడుతుంటారు. మా పెద్దనాన్న, పెద్దమ్మ చనిపోయారని చెప్పి వాళ్లతో పాడించుకున్నారు. ఓ రకమైన ఆనంద బాష్పాలను కార్చారు. ఈ విషయం నాకు తెలిసింది. ఇదొక గొప్ప విషయం. కాకులు ముట్టటం అనేది నేనేమి కొత్తగా చెప్పలేదు. ఇది మన సాంప్రదాయం. ఇది తెలుగు వాళ్ల సాంప్రదాయం. ఇది అందరికీ తెలిసిందే. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కి ఈ పాయింట్ చెప్పగానే బాగుంది అన్నాడు. ఇద్దరం కలిసి నాగారం, జగిత్యాల ఇలా పది ఊళ్లు తిరిగి కథమై రీసెర్చ్ చేశాం. నిజం చెప్పాలంటే ఇది కథ కాదు. మన తెలుగు జీవితాల్లో జరిగే సంఘటనలు. ఈ కథకోసం 2018 నుంచి నేను అన్ని పక్కన పెట్టి రీసెర్చ్ చేసి కథను రూపొందించాను. క్లైమాక్స్ కోసం అయితే మూడు నెలలు కష్టపడ్డాను. 15 మంది బుడగ జంగాల వారిని కలిసి.. వారితోనే పాటలు పాడించుకున్నాను’ అని వివరణ ఇచ్చారు.

ఆయనెవరో తెలియదు..
‘సినిమా రిలీజ్​ అయ్యాక సతీష్ అని ఎవరో వచ్చి బలగం తన కథ అంటున్నారు. ఆయనెవరో నాకు తెలియదు. ఇది తెలంగాణ సంస్కృతి నుంచి పుట్టిన కథ. ఇది చరిత్ర మనకు ఇచ్చింది. ఎవరి సొత్తు కాదు. పెళ్లిలో మంగళసూత్రం కట్టడం, ఊరేగింపు, అప్పగింతలు ఇవన్నీ ఓ సాంప్రదాయం. అలాంటి వాటని నాదని అంటే ఎలా. నా సినిమా కథను, సతీష్ గారి కథను చదివి మాట్లాడండి. రెండు పేజీల కథకు, వంద పేజీల కథకు ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది. రైటర్ అసోసియేషన్ కు వెళ్లి మాట్లాడండి. వాళ్లు ఏది చెబితే అది స్వీకరిస్తాను. చిల్లర పబ్లిసిటీ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణ సంస్కృతిని ఇంత బాగా చూపిస్తే.. దిల్ రాజు గారు ఈ సినిమాను టేకప్ చేయకపోతే ఈ సినిమా గురించి తెలిసేదా. నాకు దిల్ రాజు గారు అవకాశం ఇచ్చారు. ఈ కథ రాసింది నేను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజు గారు నిర్మాత. ఆయనతో ఎందుకు. అలాంటి పెద్ద వ్యక్తిని అబాసు పాలు చేయడానికి, ఆయన బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని చిల్లర వ్యక్తులు చేసే డ్రామా ఇది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. నేను పచ్చికి కథ చదివాను. ఆయన కథలో పర్యావరణం అనే పాయింట్ ను టచ్ చేశారు. దానికి దీనికి సంబంధం లేదు’ అని వేణు చెప్పుకొచ్చారు.

దిల్​ రాజుతో మాట్లాడా..
అయితే బలగం కథ గురించి సినిమా నిర్మాణ సమయంలోనే దిల్​ రాజుతో మాట్లాడానని చెబుతున్నారు జర్నలిస్ట్​ సతీష్​. ‘నేను మాట్లాడినప్పుడు నా పేరు, క్రెడిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాను. అయితే థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓటీటీ ఫీడ్ పంపించాం. ఇప్పుడు క్రెడిట్ ఇవ్వడం కుదరదు. తర్వాత నా బ్యానర్‌లో పనిచేసే అవకాశం ఇస్తాను. వివాదం ఎందుకు.. ఏదైనా సినిమా చేస్తే నీకు తప్పకుండా అవకాశం ఇస్తానని దిల్​ రాజు చెప్పారు’ అంటున్నారు సతీష్​.