Summer: పోషకాలు అందించే సూపర్ కాంబినేషన్స్!
Hyderabad: చిన్న పిల్లలకు(Kids) ఆహారం తినిపించాలంటే తల్లులు నానా తంటాలు పడాల్సిందే. అందులోనూ వేసవి కాలం(Summer) వచ్చిందంటే పిల్లలు అస్సలు తినరు. అయితే వేసవిలోనూ పిల్లలు పోషకాహారం లోపం బారిన పడకుండా ఉండాలంటే వారికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను అందించాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల పిల్లలకు పోషకాలు చక్కగా అందుతున్నాయంటున్నారు నిఫుణులు. ఆ సూపర్ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం..
అల్పాహారంగా అరటిపండు ముక్కలను, పెరుగులో కలిపి తినిపించాలి. అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది పెరుగు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలతో కలవడం వల్ల శరీరంలోని కండరాలకు మంచి జరుగుతుంది. అరటి పండులో ఇన్సులిన్ అధికంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రోబయోటిక్.
పుట్టగొడుగులు, నువ్వులు సూపర్ కాంబో. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. క్యాల్షియం, విటమిన్ డి పుట్టగొడుగులు, నువ్వుల గింజల ద్వారా అందుతాయి. విటమిన్ డి ఆహారంలోని క్యాల్షియాన్ని పేగులు శోషించుకునేలా చేస్తుంది.
నిమ్మకాయ, ఆకుకూరలను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి, శరీరాన్ని ఐరన్ గ్రహించేలా చేస్తుంది.
రోజుకో స్పూన్ ఆలివ్ నూనె తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర వండినప్పుడు నూనెతో వండితే మంచిది. రెండింట్లోనూ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. పిల్లలకు తినిపించడం మరీ మంచిది.
బాదంపప్పు, నారింజ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం. ఈ రెండింటిలో విటమిన్ సి, విటమిన్ Eలు అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయి. చర్మానికి రెట్టింపు అందాన్ని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.