Straight From Heart: నో చెప్తే ఇంతకు దిగజారాలా..?
Hyderabad: ఒకరిని ప్రేమించడం తప్పు కాదు.. వారికి ఆ ప్రేమ విషయం చెప్పి ప్రపోజ్ చేయడం కూడా తప్పు కాదు. కానీ నో అని రిజెక్ట్ చేస్తే వారిపై పగ తీర్చుకోవాలని అనుకోవడం క్షమించరాని నేరమనే చెప్పాలి అంటోంది ఓ అమ్మాయి. నో చెప్పినందుకు తన కంటే వయసులో పదేళ్లు పెద్దవాడైన ఓ వ్యక్తి గురించి వివరిస్తూ మాకు పంపిన కథ ఇది. (straight from heart)
నాలుగేళ్ల క్రితం జరిగిన కథ ఇది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తెలుగు మీడియా కంపెనీలో జర్నలిస్ట్‌గా పనిచేసే రోజులవి. వర్క్‌లో ఉండగా మేడమ్ పక్క డెస్క్‌లోకి వెళ్లి కూర్చుంటారా అంటూ వచ్చాడు ఫణి (పేరు మార్చాం). కానీ నాకు అక్కడ కంప్యూటర్ సరిగ్గా పనిచేయడం లేదని నేను ఇక్కడే కూర్చుంటాను సర్ అని చెప్పాను. దానికి ఫణి ఇట్స్ ఓకేనండి. మీరు నన్ను సర్ అని పిలవాల్సిన అవసరం లేదు. నా పేరు ఫణి అని పరిచయం చేసుకున్నాడు. ఇక పరిచయాలు అయ్యాక ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయాం.
ఇక రోజూ ఫణి ఆఫీస్‌కి రాగానే ముందు నన్న పలకరించేవాడు. నేను కూడా హాయ్ ఫణి అనేదాన్ని. ఓసారి నేను ఆయన్ని పేరు పెట్టి పిలవడం చూసి నా కొలీగ్ ఆయన మనకంటే పదేళ్లు పెద్దవారు. అలాంటిది పేరు పెట్టి పిలుస్తావేంటి అనింది. అతనే అలా పిలవమన్నాడు అని చెప్పాను. అప్పుడు నా కొలీగ్.. అయితే అన్న అని పిలువు. లేదంటే రెస్పెక్ట్ లేదు అనుకుంటారు అని మందలించింది. అప్పటినుంచి నేను ఫణిని అన్న అని పిలవాలని ఫిక్స్ అయ్యాను. ఓసారి ఫణి ఏదో పని కోసం నన్ను పిలిచాడు. చెప్పండి అన్నా అని అన్నాను. నేను అలా పిలవగానే అతని ముఖంలో ఏదో తెలీని ఇరిటేషన్.
నాకు అర్థంకాలేదు. ఏమైంది అన్నా ఏమన్నా ప్రాబ్లామా అని అడిగాను. దానికి అతను.. నువ్వు ముందు నన్ను అన్నా అని పిలవడం ఆపు అన్నాడు. ఆఫీస్ కదా.. అన్న బాబాయ్ అని పిలుచుకుంటే బాగోదని అలా అంటున్నాడేమో అనుకున్నా. అప్పటినుంచి సర్ అనే పిలిచేదాన్ని. కొన్ని రోజులకే మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అతను ఉండేది మా ఇంటి పక్క గల్లీలోనే అని తెలిసింది. పాపం బ్యాచిలర్ కదా అని ఓసారి లంచ్‌కి పిలిచాను. మా అమ్మ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఓ రోజు అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ నా లైఫ్‌లో ఒక అబ్బాయి ఎంత దారుణంగా మోసం చేసాడో తనకి చెప్పాను. తను కూడా ఇలాంటి అబ్బాయిలను ఆ దేవుడు వదిలిపెట్టడు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఓ అన్నలా తను నన్ను ఓదార్చడం ఎంతో నచ్చింది.
ALSO READ: “అతన్ని ప్రేమించాను.. ఇతన్ని ఇష్టపడుతున్నాను”
ఓరోజు ఫణి గురించి నాకు షాకింగ్ విషయం తెలిసింది. నా మంచి కోరుకునే కొందరు నా దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పేవరకు అతని ఇన్టెన్షన్ నాకు అర్థం కాలేదు. ఫణికి నేనంటే ఇష్టమట. నన్ను ఆఫీస్‌లో చూడగానే నా వివరాలన్నీ తెలుసుకున్నాడట. పైగా ఇద్దరిదీ సేమ్ కాస్ట్ అని కూడా తెలుసుకున్నాడట. అది విని నేను షాకయ్యాను. నాకంటే వయసులో పదేళ్లు పెద్దవాడు. పైగా నేను అన్నా అని పిలిచాను. అలాంటిది అతనికి నా మీద అలాంటి ఫీలింగ్స్ ఎలా అని నామీద నాకే చిరాకేసింది. (straight from heart)
అసలే ఆ మీడియా కంపెనీలో పనిచేసేవాళ్లంతా బావిలో కప్పల్లా ఉంటారు. నేను ఒక్కదానిని కాస్త మోడ్రన్‌గా ఉండేదాన్ని. దాంతో అందరికీ నేను బరితెగించిన ఆడపిల్లలా కనిపించేదాన్ని. నాతో మాట్లాడాక కొందరికి నేనేంటో అర్థమైంది. నన్ను చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాళ్లు. ఈ ఫణి విషయం తెలిస్తే అందరూ నన్ను తప్పుగా అర్థంచేసుకుంటారేమోనని దూరం పెట్టడం స్టార్ట్ చేసా. ఆ విషయం తనకు అర్థమైనట్లుంది. దాంతో ఇన్‌డైరెక్ట్‌గా నేను రాసే ఆర్టికల్స్ గురించి తప్పుగా మాట్లాడేవాడు. నేను పట్టించుకోలేదు. కొన్ని నెలలు గడిచాక.. అదే కంపెనీలో వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయితో పరిచయం అయింది. మేమిద్దరం మాట్లాడుకోవడం ఫణికి ఏమాత్రం నచ్చేది కాదు.. ఎలాగైనా నా ఇమేజ్‌పై కొట్టాలనుకున్నాడు. ఓసారి ఆఫీస్ ప్యాంట్రీలో కొందరు అబ్బాయిలు నేను రాగానే నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటుంటే విన్నాను.
ఎందుకొచ్చిన గొడవలే అని నేనేమీ అడగలేదు. ఆ తర్వాత ఓ అబ్బాయి నా దగ్గరికి వచ్చి.. నిన్ను ఒక అబ్బాయి వాడుకుని వదిలేసాడని, నువ్వు కూడా పైకి కనిపించేంత మంచిదానివి కాదని ఫణి మా డెస్క్‌లో ఉన్న కొందరు అబ్బాయిలకు చెప్తుంటే విన్నాను. కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అది విన్నాక ఫణిపై అసహ్యం వేసింది. కేవలం నేను తనకు నో చెప్పి ఇంకో అబ్బాయితో మాట్లాడుతున్నానని నేను తనకు చెప్పిన విషయాలనే వేరే వాళ్లకి చెప్పి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూసాడు. ఇతన్నా నేను అన్నగా భావించింది అని నా మీద నాకే అసహ్యమేసింది. నేను తలుచుకుంటే వెంటనే హెచ్ఆర్కి చెప్పి రచ్చ చేసి మరీ అతన్ని ఉద్యోగం నుంచి తీయించేయచ్చు. కానీ అప్పటికే నాకు వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ రావడంతో ఎలాంటి గొడవలు లేకుండా వెళ్లిపోవడమే మంచిది అనిపించింది.
అలా అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే…. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్తే అర్థంచేసుకుని వదిలేయండి. అంతేకానీ వారి గురించి లేనిపోనివి చెప్పి జీవితాలను పాడుచేయకండి. (straight from heart)