Straight From Heart: ఆ అబ్బాయి నిజంగా దేవుడే…!
Hyderabad: అబ్బాయిలంతా ఒకటే అని అమ్మాయిలు.. అమ్మాయిలంతా మోసం చేసేవారు అని అబ్బాయిలు అనుకోవడం కామన్. ఈ రోజుల్లో అయితే ఒకరంటే ఒకరికి నమ్మకాలే లేకుండా పోతోంది. అలాంటిది.. తన జీవితంలోకి సాక్షాత్తు దేవుడిలా వచ్చి వెళ్లిపోయాడని ఓ యువతి మాకు రాసిన ఈమెయిలే ఈ కథ. (straight from heart)
అమ్మాయి కడపలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగింది. చిన్న వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. తల్లికి చదువులేదు. దాంతో ఆ అమ్మాయి తాతగారే చేరదీసి పెంచి పెద్ద చేసారు. అమ్మాయి చక్కగా చదువుకుని మంచి జాబ్ సంపాదించుకుంది. ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనిది కూడా రాయలసీమే అని తెలిసి ఫ్రెండ్షిప్ చేసింది. కొద్ది రోజుల్లోనే ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకునే సమయానికి వారి వయసు 27. ఆ వయసులో తిరగడాలు, టైం పాస్ చేయడాలు ఎందుకు అని పెళ్లి చేసేసుకోవాలి అనుకున్నారు. అలా ఇద్దరూ ఇంట్లో చెప్పుకున్నారు. అమ్మాయి తల్లి ఒప్పుకుంది. అబ్బాయి ఇంట్లో వారు మాత్రం ససేమిరా అన్నారు. (straight from heart)
ఇందుకు కారణం..పుట్టుకతోనే అమ్మాయికి కిడ్నీ లేకపోవడం. ఈ ఒక్క కారణం వల్ల అబ్బాయి తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. దాంతో ఎలాగైనా ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని.. తనను ఓ మంచి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్‌తో అన్నీ మాట్లాడాక.. సర్.. తనకు నా కిడ్నీ ఇస్తాను. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారా? అని అడిగాడట. ఆ మాట వినగానే డాక్టర్ షాకయ్యాడు. అతని మంచి మనసు డాక్టర్ అర్థంచేసుకోగలిగాడు కానీ.. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని, ఒక్క కిడ్నీతో బతికిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు.
ALSO READ: అంత మంచి భర్తను ఎలా వదులుకుందో..!
డాక్టర్‌తో ఆ అబ్బాయి ఈ మాటలు చెప్పేటప్పుడు ఆ అమ్మాయి బయట వెయిట్ చేస్తోందట. ఆ తర్వాత డాక్టర్ అమ్మాయిని పిలిచి నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇలాంటి అబ్బాయి నీకు దొరికినందుకు అన్నారట. తనకు ఏమీ అర్థంకాలేదు. ఆ తర్వాత తనే డాక్టర్‌కు స్వయంగా ఫోన్ చేసి ఏం జరిగింది సర్ అని అడిగిందట. అప్పుడు ఆ అబ్బాయి చెప్పినవన్నీ డాక్టర్ వివరించాడు. అది విన్నాక ఆ అమ్మాయి కంట నీరు ఆగలేదు.
ఎప్పుడో ఒకప్పుడు ఒప్పుకోకపోరా అని ఆ అబ్బాయి, అమ్మాయి ఎంతో వెయిట్ చేసారు. కానీ వారి ప్రేమ గెలవలేదు. ఇంట్లో వారి పట్టింపే గెలిచింది. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం అని తల్లిదండ్రులు అనడంతో ఆ అబ్బాయి వెనకడుగు వేయక తప్పలేదు. గుండెల నిండా బాధతో ఏమీ చేయలేని పరిస్థితితో ఆ అబ్బాయిని బలవంతంగా పెళ్లి పీటలు ఎక్కించారు. ఆ అమ్మాయి కూడా ఇప్పుడిప్పుడే అంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తోందట. ఇంట్లో వారు తనకు వేరే సంబంధాలు కూడా చూస్తున్నారని ఆ అమ్మాయి చెప్పింది.
చివరిగా ఆ అమ్మాయి అందరు తల్లిదండ్రులకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. ఒక్క కిడ్నీ ఉన్నంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదని, ఒక్క కిడ్నీతో కూడా సాధారణ మనిషిలాగే లైఫ్ లీడ్ చేయొచ్చని డాక్టర్లు బల్ల గుద్ది చెప్తున్నారని అంటోంది. తనలా మరెవ్వరికీ కాకూడదని కోరుకుంటోంది.