దుకాణదారులకు పండగే.. 24 గంటలూ వ్యాపారం చేసుకోవచ్చు!

తెలంగాణ సర్కార్‌ దుకాణదారులకు, షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు, వివిధ ప్రైవేటు సంస్థల నిర్వాహకులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు సమయపాలన పాటిస్తూ.. దుకాణాలు నిర్వహిస్తున్న వారికి.. ఇకపై 24 గంటలూ షాపులు తెరిచే ఉంచుకోవచ్చని దీనికి సంబంధించిన అనుమతులను జారీ చేసింది. ఇది ప్రధానంగా పట్టణాలు, నగరాలతో పాటు.. హైదరాబాద్‌ మహా నగరంలో వ్యాపారాలు చేసుకునేవారికి ఊరట కల్పించే విషయం. అయితే.. కొన్ని నిబంధనలను కూడా నిర్వాహకులు పాటించాలని చెబుతోంది. కార్మిక చట్టాన్ని అనుసరించి.. ద్యోగులందరికీ ఐడీ కార్డులివ్వాలని, వారాంతపు సెలవులు, వారానికి పనిగంటలు తప్పనిసరిగా పాటించాలని, అదనపు సమయం పనిచేసినప్పుడు ఓవర్‌టైం వేతనాలివ్వాలని కార్మికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం గుర్తించిన సెలవులు, పండగ వేళల్లో పనిచేస్తే వేతనంతో కూడిన ప్రత్యామ్నాయ సెలవు కల్పించాలని, మహిళా ఉద్యోగులకు భద్రతా చర్యలతోపాటు రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించింది. యాజమాన్యాలు ఉద్యోగులు, ఇతర అంశాలకు సంబంధించిన రికార్డులు నిర్వహించడంతోపాటు ఎప్పటికప్పుడు రిటర్నులు దాఖలు చేయాలని, పోలీసు నిబంధనల మేరకు వ్యవహరించాలని వెల్లడించింది. 24 గంటలూ దుకాణాలు, సంస్థల్ని నిర్వహించేందుకు వార్షిక ఫీజు రూ.10 వేలు అదనంగా చెల్లించాలని సూచించింది.