Real Story: “అతన్ని ప్రేమించాను.. ఇతన్ని ఇష్టపడుతున్నాను”
Real Story: ఒక వ్యక్తితో ఏడాది పాటు ప్రేమలో ఉన్న ఓ అమ్మాయికి మరో వ్యక్తి దగ్గరయ్యాడు. అతనిపైనా ఇష్టం పెంచుకుంది. ఇప్పుడు ఎవరితో ఉండాలో తెలీడంలేదని తన బాధను మాతో ఈమెయిల్ ద్వారా పంచుకుంది. ఆ అమ్మాయి కథేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
“” హాయ్. నా పేరు రమ్య. నా వయసు 29 సంవత్సరాలు. నా కథ విన్నాక నన్ను అసహ్యించుకుంటారని తెలుసు. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని నా కథను మీతో పంచుకోవాలనుకున్నాను. నేను టిండర్‌లో ఒక అబ్బాయిని కలిసాను. ఈ టిండర్ ఐడియా ఇచ్చింది మా అక్కే. త్వరగా పెళ్లి చేసుకో అంటూ తొందరపెడుతుంటే టిండర్ ఓపెన్ చేసాను. చాలా మంది నా ప్రొఫైల్‌ను లైక్ చేసారు. వారిలో ఒక అబ్బాయి ఎంతో నచ్చాడు. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. మా మనసులు కలిసాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇంట్లో ఒప్పుకున్నారు.
కానీ ఆ అబ్బాయి ఇంట్లో మాత్రం నో అనేసారు. ఇందుకు కారణం మా కులాలు వేరు. కులం పరంగా చూసుకుంటే మాదే పైచేయి. అయినా ఆ అబ్బాయి తండ్రి ఒప్పుకోలేదు. ఒప్పుకోవడంలేదు అంటున్నాడే తప్ప ఎలాగోలా ఒప్పించి చేసుకోవాలన్న ఆలోచన ఆ అబ్బాయికి లేదు. ఏదో రోజూ నాతో మాట్లాడాలి కాబట్టి ఫోన్లు చేస్తుంటాడు. అలా రోజూ సరదాగా మాట్లాడుకుంటాం.
ALSO READ: అలసిపోయేలా ప్రేమించి అలుసైపోయా!
ఈ నేపథ్యంలో నాకు ఇంకో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ అబ్బాయికి నేను చూడగానే నచ్చేసాను. పైగా ఇద్దరికీ ఒకే కులం. ఇంట్లో అడ్డుచెప్పేవారు లేరు. పెళ్లి చేసుకోలేను అని చెప్తున్న వ్యక్తి కోసం ఇంకెంత కాలం ఎదురుచూస్తావ్.. నీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకుందాం అనేసాడు. నాకేం చెప్పాలో అర్థంకావడంలేదు. నేను అంత తేలిగ్గా ప్రేమించిన మనిషిని మర్చిపోలేను. ఈ విషయం గురించి నేను ప్రేమించిన అబ్బాయికి చెప్తే నీకు నచ్చితే చేసుకో.. నా దురదృష్టం ఇంతే అనుకుంటాను అంటున్నాడు. నాకు ఏం చేయాలో అర్థంకావడంలేదు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎప్పటికైనా మా పెళ్లికి ఒప్పుకోకపోరా అని ఎదురుచూస్తున్నాను. నాకు వయసు పెరిగిపోతున్న కొద్దీ భయమేస్తోంది. ఏం చేయాలో తెలీక నరకం అనుభవిస్తున్నాను. నాలాంటి దుస్థితి మరెవ్వరికీ రాకూడదని కోరుకుంటూ.. ఓ సోదరి “” (Real Story)