పవన్ ఎంట్రీ అదుర్స్.. ఇక సమరానికి రెడీ అయినట్లేనా?
ఏపీ రాజకీయాలు జనసేన ఆవిర్భావ సభతో వేడెక్కనున్నాయి. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇక పాలిటిక్స్‌తో బిజీ కానున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందే సుమారు నాలుగైదు రోజుల పాటు జనసేనాని విజయవాడలోనే ఉండనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇక ఎయిర్ పోర్ట్‌లో సరికొత్త లుక్‌లో కనిపించిన పవన్‌ను చూసిన ఫ్యాన్స్‌ను ఫిదా అయ్యారు. బ్లాక్ టీషర్ట్, ఆర్మీ కలర్ ప్యాంట్ ధరించి… యుద్దానికి తాను సిద్దం అన్నట్లు ఆయన ఆహార్యం కనిపిస్తోంది. దీంతోపాటు పవన్ వారాహి వాహనం కూడా ఆలివ్ కలర్‌లో ఉండటం.. ఇదంతా చూస్తుంటే… ఇక సమరానికి పవన్ రెడీ అయినట్లేనని జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు.
వరుస సమావేశాలతో బిజిబీజీ..
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు జనసేనాని పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అక్కడ ఇవాళ ఉదయం నుంచి బీసీ నాయకులతో జనసేన నేతల భేటీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు బీసీ కులాలకు చెందిన వారి వృత్తి, వ్యక్తిగత సమస్యలను పవన్ నేరుగా తెలుసుకోనున్నారు. దీంతోపాటు బీసీలకు జనసేన నుంచి ఏ విధమైన సపోర్టు ఉంటుందో ఆయన తెలియజేయనున్నారు. ఇక ఇవాళ్టి కార్యక్రమం తర్వాత.. కాపు సంఘాలకు చెందిన నేతలతో రేపు అనగా… ఈ నెల 12న పవన్ సమావేశం కానున్నారు. దీనిలో కాపుల రిజర్వేషన్ అంశంతోపాటు, కాపులను వైసీపీ మోసం చేస్తున్న తీరును నాయకులు పవన్‌కు వివరించనున్నారు. దీని తర్వాత ఆయన స్పందనను ఆవిర్భావ సభ ద్వారా తెలియజేయనున్నారు. ఈనెల 13న జనసేన రాష్ట్ర, జిల్లాల నాయకులతో జనసేనాని భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఏవిధంగా ముందుకెళ్లాలి వంటి అంశాలపై ఆయన వారితో చర్చించనున్నారు. క్షేత్రస్థాయి నాయకుల నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
ఆవిర్బావ సభ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..
ప్రధానంగా జనసేన కార్యకర్తలు, నాయకులతోపాటు.. అన్ని పార్టీలు, ప్రజలందరూ కూడా జనసేనాని పవన్ కల్యాణ్ ఆవిర్బావ సభ వేదికపై నుంచి ఏం మాట్లాడతారు.. ఆయన ప్రసంగం ఏవిధంగా ఉంటుంది.. అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు ఏవిధమైన దిశానిర్దేశం చేస్తారు.. జనసేనా మేనిఫెస్టో, వారాహి యాత్ర, టీడీపీ, బీజేపీలతో పొత్తు వంటి అంశాలపై పవన్ క్లారిటీ ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలోని నాయకులను లక్ష్యంగా చేసుకుని పవన్ పంచులు ఏవిధంగా ఉంటాయో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.