తెలంగాణలో ఆగని లీకులు.. హిందీ ప్రశ్నాపత్రం కూడా బయటకి!
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ తెలంగాణలో కలకలం రేపుతోంది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట పేపర్ లీకేజీ ఘటనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. నిన్న తెలుగు ప్రశ్నాపత్రం వికారాబాద్ జిల్లాలో పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చింది. ఇక తాజాగా ఇవాళ(మంగళవారం) హిందీ పేపర్ సైతం లీక్ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఉదయం 9.30 గంటలకు పేపర్ బయటకు వచ్చినట్లు సమాచారం. పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ పేపర్ చక్కర్లు కొట్టిందని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై అధికారులు స్పందించాల్సి ఉంది. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సుమారు అయిదుగురు అధికారులపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయగా.. బందప్ప, సమ్మప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ పేపర్ లీకేజీ ఘటనలు ఆగకపోవడంతో సంచలనంగా మారింది.