వేధిస్తున్నాడని చంపేసింది!
ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించమని వెంటపడుతున్న ఓ యువకుడి సదరు యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. అయితే.. ఈ వేధింపులకు పాల్పడుతున్నది.. సమీప బంధువే అయినప్పటికీ యువతి.. యువకుడిని హత్య చేయడం సంచలనంగా మారింది. హత్య చేసిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ యువతి లొంగిపోయింది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మూడో వార్డులో దారుణం చోటుచేసుకుంది. యువకుడు తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడని విసిగిపోయిన ఆ యువతి.. కత్తితో అతన్ని పొడిచి హతమార్చింది. జాడి సంగీత అనే యువతి ఏటూరు నాగారం మూడో వార్డు ఎర్రెళ్లవాడలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటోంది. ఏటూరు నాగారానికే చెందిన రాంటెంకి శ్రీనివాస్ (25)కు ఇది వరకే వివాహం కాగా.. భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన శ్రీనివాస్ తరచూ సంగీత ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఆమెను వేధించేవాడు. తన కోరిక తీర్చాలంటూ పలుమార్లు సంగీతను బలవంతం చేశాడు. దీనిపై కొన్ని నెలల క్రితం ఏటూరు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాస్.. సంగీతను మరింత ఎక్కువగా వేధించసాగాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లి బలవంతం చేశాడు. తరచూ ఇలా జరుగుతుండటంతో కోపోద్రిక్తురాలైన సంగీత.. శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి హతమార్చింది. అనంతరం రాత్రి 2 గంటల తర్వాత పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.