ఢిల్లీకి బయల్దేరిన కవిత.. కేసీఆర్ హామీ ఇదే!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇవాళ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే.. ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల రీత్యా 10వ తేదీ విచారణకు హాజరుకాలేనని ఈడీకి కవిత ఇవాళ లేఖ రాసింది. దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఈ విషయంపై తన తండ్రి కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆమె ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇక అక్కడ ఆమెను అరెస్టు చేస్తారా.. లేరా విచారణకు మరో రోజు పిలుస్తారా సస్పెన్స్‌గా మారింది.
కేసీఆర్ ఏమని చెప్పారంటే..
ఢిల్లీలో మహిళ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు కవిత కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. ఈక్రమంలో ఆ కార్యక్రమానికి వెళ్లాలని కేసీఆర్ ఆమెకు సూచించారు. ఈడీ నోటీసులపై ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. న్యాయపరంగా బీజేపీ ఆకృతాలపై పోరాడదామని కవితకు కేసీఆర్ భరోసా కల్పించారు. ఇక కవితతోపాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ దీక్షకు ప్రముఖుల రాక..
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఒకరోజు నిరాహార దీక్షలో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు. అయితే ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. మరోవైపు కవిత దీక్షకు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతోపాటు, పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు దీక్షలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
బండి సంజయ్ కవితపై కౌంటర్లు..
కవితకు నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర మంత్రులు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి బీజేపీ, ఇతర ప్రతిపక్ష నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. బండి సంజయ్ అయితే ఏకంగా విచారణకు హాజరై, నిర్దోషిగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దీంతో ఈ కేసులో తర్వాత ఏం జరగబోతున్నదనే చర్చ జోరుగా నడుస్తున్నది. మరోవైపు మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈడీ నోటీసులకు కవిత ఎందుకు రాద్దాంతం చేస్తుందో అర్థం కావట్లేదని.. విచారణకు వెళ్లి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు.