ఎవరొస్తారో రండి.. రోడ్డుపై కూర్చుని ఎమ్మెల్యే సవాల్

సాధారణంగా విలన్లు హీరోలకు వార్నింగ్‌ ఇవ్వడం.. లేదా హీరోలు విలన్లకు వార్నింగ్‌ ఇవ్వడం కామన్‌.. పలానా చోటుకి రా చూసుకుందాం అంటే.. అక్కడ డైరెక్టర్‌ ఏదో పెద్ద ఫైట్‌ ప్లాన్‌ చేసి ఓ మంచి ఫైట్‌ సీన్‌ తీస్తాడు.. కానీ ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సినిమాలను తలపిస్తున్నాయి. సినిమాల్లోలా మీడియా ముందుకు వచ్చి డైలాగులు మాట్లాడటం, సవాళ్లు విసురుకోవడమే కాదు.. నేరుగా బాహాబాహీకి నాయకులు దిగుతున్నారు. కొంత మంది అయితే మరో అడుగు ముందుకేసి.. నేరుగా కొట్టుకుందాం రా.. ఇక్కడికి ఎలా వస్తావో మేం చూస్తాం.. అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ ఘటనలు ఏపీలో గత కొంతకాలంగా జరుగుతున్నాయి.. కానీ ఇవన్నీ టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య సాధారణమే అయినప్పటికీ.. ఇప్పుడు కొత్తగా వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలకు.. వైసీపీ కార్యకర్తలు, నాయకులకు మధ్యే ఈ ఘర్షణ వాతావరణం నెలకొనడం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనే ఇవాళ నెల్లూరు జిల్లా ఉదయగిరి టౌన్‌లో చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ పలువురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకరు. వైసీపీ నుంచి మేకపాటిని సస్పెండ్ చేసిన తరువాత.. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు, పలువురు నాయకులు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఈక్రమంలో వారు మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌ రెడ్డిని అసలు నియోజకవర్గంలో అడుగుబెట్టనీయమని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

బస్టాండ్‌ సెంటర్లో కూర్చుని సవాల్‌..
ఉదయగిరి ఎమ్మెల్యేను నియోజకవర్గంలోకి రానివ్వం అంటూ పలువురు వైసీపీ నాయకులు చెప్పడంతో.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చారు. బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చున్నారు. తాను వస్తే తరిమేస్తానని సవాల్ చేసిన వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు. బస్టాండ్‌ సెంటర్‌లో కొంతసేపు కలియతిరిగారు. వైసీపీ నాయకత్వం తనపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు. తాను. పార్టీలో లేనని చెప్పి కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను ఇక్కడి నుంచి నుంచి తరిమికొట్టండి చూద్దాం అంటూ.. ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇచ్చారు.