పోలవరంపై ముఖ్యమంత్రికి కేవీపీ లేఖ!
పోలవరం నిర్మాణంలో పంతాలకు పోకుండా వేగంగా పూర్తి చేయడం కోసం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు లేఖ రాశారు. ఈ విషయంపై ఇటీవలే కేంద్రానికి లేఖ రాసిన ఆయన తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ వైఖరి ప్రదర్శించవద్దని మాజీ ఎంపీ కేవీపీ ముఖ్యమంత్రికి సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించొద్దని ప్రధాని మోదీకి లేఖ రాసిన కేవీపీ, తాజాగా ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశారు.
‘పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత మీకు తెలియనిది కాదు. కారణాలు ఏవైనా పోలవరం ప్రధాన డ్యాం పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎప్పటికీ పూర్తి అవుతుందో ప్రభుత్వ వర్గాలే చెప్పలేని పరిస్థితి ఉంది. పోలవరం పూర్తి అయితే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకి అందించి, ఆ మేరకు కృష్ణా నదిలో మిగిలిన జలాలతో రాయలసీమ జిల్లాల రైతులు, కుడి కాలువ క్రింద పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రైతులు, ఎడమ కాలువ క్రింద తూర్పు గోదావరి, విశాఖలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు ఆనందంగా పంటలు పండించుకొనే రోజు వచ్చినప్పుడే వైఎస్. రాజశేఖరరెడ్డి కన్నకల తీరుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు, పోలవరాన్ని పూర్తిగా కేంద్రమే నిర్మించాలని చెబుతోందని, మోడీకీ-చంద్రబాబుకు కుదరిన ఏమి ఒప్పందం జరిగిందో తెలియదని ప్రాజెక్టు ఖర్చు భారాన్నికుదించుకుంటూ..ఆర్ధిక భారాన్ని రాష్ట్రంపై మోపుతూ..మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేవీపీ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించి, ఆనందంగా అంగీకరించిందన్నారు. జగన్ నాయకత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను, పోలవరం నిర్మాణం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన పోలవరం ప్రాజెక్టు ఆధారిటీకి అప్పచెపితే.. కేంద్రమే నిర్మాణ బాధ్యత చేపడుతుందని..రాష్ట్రం పై ఆర్ధికభారం పడకుండా ఉంటుందని కేవీపీ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రం తీసుకోవడంతో పోలవరం నిధుల విషయంలో గానీ, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల పరిష్కారాల విషయంలో గానీ, ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ను ఆమోదించే విషయంలో గానీ, కేంద్రం చొరవ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని కేవీపీ ఆరోపించారు. భూసేకరణ, పునరావాస-పునర్నిర్మాణ పనులకు అవసరమైన దాదాపు 30,000 కోట్ల రూపాయల ఖర్చుతో తనకు సంబంధం లేనట్లుగానే కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా, ఆ ఖర్చు రాష్ట్రమే భరించి, ఆ పనులు చేసే ఆర్ధిక పరిస్థితి రాష్ట్రానికి లేదన్నారు. మరి ఈ లేఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.