తిమ్మాపూర్‌ ఆలయంపై KCR వరాల జల్లు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో గత నాలుగు రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. ఇవాళ చివరి రోజు కేసీఆర్‌ దంపతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ స‌భ్యులు సీఎం దంపతులకు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. అనంతరం వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణోత్సవంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆయన శోభ కలిసి దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను “వేదపండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం తర్వాత నిర్వహించిన తిమ్మాపూర్‌ కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

తిమ్మాపూర్‌ బాన్సువాడ ఆలయానికి 7… బాన్సువాడ‌కు 50 కోట్లు..

తిమ్మాపూర్‌ కృతజ్ఞత సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌… వరాల జల్లు కురిపించారు. ఈ సందర్బంగా తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ నాటి పాలకులు చాలా కర్కశంగా వ్యవహరించారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. కరువుతో నిజామాబాద్ జిల్లా వాసులు కొట్టుమిట్టాడారని అన్నారు. సాగునీటి కోస రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి… సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందని.. అందుకే సీఎం నిధుల నుంచి అభివృద్ధి పనుల నిమిత్తం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కాళేశ్వరం పథకం ద్వారా నిజాంసాగర్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

దేశ ప్రజలు కేసీఆర్‌ కోసం ఎదురుచూస్తున్నారు – పోచారం

స్పీకర్‌ పోచారంపై సీఎం కేసీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు తన వెంట పోచారం ఉండాలని అన్నారు. బాన్సువాడ అభివృద్ధికి ఆయన ఎంతో కష్టపడుతున్నారని.. ఇంకా అనేక కార్యక్రమాలు త్వరలో జరుగుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ.. తిమ్మాపూర్‌ వెంకన్న ఆలయ అభివృద్ధికి కారణం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కరవు లేదని తెలిపారు. గోదావరి జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు కళకళ లాడుతోందని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1200 కోట్లు ఆయన ఇచ్చారన్నారు. కేసీఆర్ రాక కోసం దేశ ప్రజలు కోసం ఎదురు చూస్తున్నారని పోచారం పేర్కొన్నారు.

.