ఢిల్లీలో కవిత దీక్ష షురూ.. 18 పార్టీల నుంచి స‌పోర్ట్

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన దీక్ష ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ముందుగా అనుకున్నట్లే ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నేత ప్రియాంక చతుర్వేది వచ్చి ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఈ దీక్షను చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు ఆమెకు మద్దతుగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నాయకులు ఇవాళ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని… సాయంత్రం 4 గంటల తరువాత సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను విరమింపజేస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

దీక్షలో తెలంగాణ మహిళా మంత్రులు… బీఆర్ఎస్  నేతలు…
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కవిత చేపట్టిన దీక్షకు తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు మద్దతుగా కూర్చుకున్నారు. తొలుత వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. మరోవైపు ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 13 పార్టీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. సీపీఐ, సీపీఎంతో పాటు.. ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే, ఆప్, నేషనల్‌ కాన్ఫరెన్స్, శివసేన, పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, జేఎంఎం సహా 18 పార్టీలు సంఘీభావంగా నిలిచాయి. దాదాపు 5 వేల మంది ఈ దీక్షలో భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.

తొలుత అనుమతులు లేవని వార్తలు..
జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపడుతున్నాని ప్రకటించిన మరుక్షణమే ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. ఆమె దీక్ష చేస్తానన్న ప్రాంతం వేరేవారికి కేటాయించారని.. మీరు మరోచోట దీక్ష చేసుకోవాలని పోలీసులు కవితకు చెప్పడంతో.. అసలు దీక్ష ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. స్థలం విషయమై ఢిల్లీ పోలీసులతో చర్చలు జరుపుతామని నిన్న మీడియాకు వివరించారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం స్థలాన్ని ఎంపిక చేసుకోవడం.. ఆ తర్వాత అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం వంటివి రాత్రికి రాత్రే అన్నీ చకచకా జరిగిపోయాయి.