Irfan Pathan: య‌శ‌స్వి జైస్వాల్‌పై సెన్సేషన‌ల్ కామెంట్స్

Irfan Pathan: టీమ్‌ ఇండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఆటతీరు మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను ఆకట్టుకొంది. మరి కొన్నేళ్లు జట్టులో కొనసాగితే అందరూ అతడి గురించి మాట్లాడుకొంటారని అన్నాడు.

టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ దాదాపు ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లోనూ సత్తాచాటాడు. సిరీస్‌లో ప్రస్తుతం అతను 321 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. తాజాగా రాజ్‌కోట్‌ టెస్ట్‌కు అయ్యర్‌, రాహుల్‌, కోహ్లీ దూరం కావడంతో టాప్‌ ఆర్డర్‌లో భారీ స్కోర్‌ చేయాల్సిన బాధ్యతను ఈ కుర్రాడు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడు రాణించాడు. వైజాగ్‌లో ద్విశతకం నమోదు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సులభమైంది. అయితే తాజాగా ఈ యువ సంచలనంపై భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏకంగా దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పోల్చాడు.

టీమ్‌ ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ఆడుతున్న కొన్ని రకాల షాట్లు సౌరవ్‌ గంగూలీని గుర్తుకు తెస్తున్నాయని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆఫ్‌సైడ్‌ షాట్ల విషయంలో జైస్వాల్‌, గంగూలీ మధ్య చాలా పోలికలున్నాయన్నాడు. ఈ యువ ఆటగాడు టీమ్‌ఇండియాలో సుదీర్ఘకాలం ఆడతాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘‘నేను జైస్వాల్‌ ఆటను చూడటానికి ఉత్సాహంగా ఉంటాను. అతడు ఐపీఎల్‌లో ఎలా ఆడతాడో చూడాలి. గతంలో గంగూలీని చూసి ‘ఆఫ్‌సైడ్‌ కింగ్‌’ అనే వాళ్లం. జైస్వాల్‌ కూడా గంగూలీ వలే కళ్లు చెదిరేలా షాట్లు ఆడుతున్నాడు. మరో 10 ఏళ్లు ఈ కుర్రాడు జట్టులో కొనసాగితే.. మనం ఇప్పుడు దాదా గేమ్‌ గురించి ఎలా చెప్పుకొంటున్నామో.. అప్పుడు అతడి ఆట గురించే మాట్లాడుకుంటాం. ఇప్పటికే యశస్వి అంతర్జాతీయ క్రికెట్‌లో ద్విశతకం బాదాడు. దీనికి తోడు అతడి వెనుక ఓ స్ఫూర్తిదాయక నేపథ్యం ఉంది’’ అని పఠాన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇదే క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ తాజాగా ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ధోనీ ఆడబోయే చివరి ఐపీఎల్ ఇదేనా అనే ప్రశ్నకు పఠాన్ బదులిస్తూ.. `కచ్చితంగా కాదు` అని సమాధానం ఇచ్చాడు. `నెల రోజుల క్రితం నేను ధోనీని కలిశాను. అతడు జుట్టును పొడవుగా పెంచుతున్నాడు. పాత ధోనీని గుర్తు తెచ్చేందుకు కష్టపడుతున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. 40 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఫిట్‌గా ఉన్నాడు. అతడి ఫ్రాంఛైజీ కోసం, అతడి అభిమానుల కోసం ధోనీ కొనసాగాలని కోరుకుంటున్నానడు`అని పఠాన్ అన్నాడు.

ఇక, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఐపీఎల్ లో గెలిచే అవకాశాలపై, ఆ జట్టు అభిమానులపై స్పందించిన పఠాన్… ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ప్రపంచంలో అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉందని అన్నారు. వారు టైటిల్ గెలిస్తే టీ20 లీగ్ చరిత్రలోనే అదొక చారిత్రక ఘట్టమని చెప్పుకొచ్చారు.

‘ఆర్‌సీబీ ఫ్రాంచైజీ- ఆ జట్టు అభిమానుల బంధాన్ని చూడండి.. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన అభిమానులు వారికున్నారు. ఆ జట్టు ఒక్కసారి టైటిల్ గెలవకపోవచ్చు. కానీ, వారు మూడుసార్లు దగ్గరగా వచ్చారు.. ఒకవేళ 2024లో వారు టైటిల్ గెలిస్తే, అది ఆర్‌సీబీ చరిత్రలోనే కాదు, ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద క్షణం అవుతుంది..’ అని పఠాన్ చెప్పుకొచ్చారు.