రైతులకు సాయం.. పోలీసులపై ప్రశంసల వర్షం!

తెలంగాణ, ఆంధప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇప్పటికే ఆ జిల్లాలోని మఠంపల్లి మండలం విస్తారంగా మిరప పంట సాగులో ఉంది. దీంతో కల్లాల్లో ఉన్న మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ఈక్రమంలో పెద్దఎత్తున పట్టలు తీసుకుని వచ్చి కల్లాల్లో ఉన్న మిర్చిపై కప్పేందుకు యత్నించారు. అప్పటికే భారీ వర్షం కురుస్తుండటంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యంలో అటుగా వెళ్తున్న పోలీసులు రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వారికి సాయం చేయాలని వెంటనే పొలాల్లోని కల్లాలవైపు పరుగులు తీశారు. ఈదురుగాలుతో కూడిన వర్షానికి తడుస్తున్న మిర్చి పంటను పట్టలతో కప్పేందుకు పోలీసులు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. అయితే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అక్కడ బందోబస్తుకు వెళ్లిన ఎస్ఐ రవికుమార్ తిరిగి వెళ్తుండగా రైతుల కష్టాలను గమనించి.. క్షణం కూడా ఆలోచించకుండా.. వాహనాన్ని రోడ్డుపై ఆపి సిబ్బందితో వెళ్లి రైతులకు సాయం అందించడంపై అందరూ ప్రశంసించారు. గతంలో కూడా హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్‌ పోలీసు గుండె నొప్పితో పడిపోయిన వ్యక్తికి వెంటనే సీపీఆర్‌ చేసి ప్రాణాలను రక్షించారు.