29 ఏళ్ల త‌ర్వాత విడుద‌లైన “ఆంజ‌నేయుడు”

29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత ఆంజనేయుడి విగ్ర‌హానికి విముక్తి క‌లిగింది. బావిలో దొరికిన విగ్ర‌హం కాబ‌ట్టి అది ప్ర‌భుత్వానికి చెందుతుంద‌ని, కావాలంటే డబ్బులు క‌ట్టి తీసుకువెళ్లాల‌ని పోలీసులు చెప్ప‌డంతో ఆ విగ్ర‌హం ఎటువంటి పూజ‌ల‌కు నోచుకోకుండా పోలీస్ స్టేష‌న్‌లో ఉండిపోయింది. ఈ ఘ‌ట‌న బిహార్‌లోని భోజ్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది. 1994 మే నెల‌లో రంగ‌నాథస్వామి ఆల‌యంలో ఆంజ‌నేయుడి విగ్ర‌హం, రామానుజస్వామి అష్ట‌ధాతు విగ్ర‌హాలు చోరీకి గుర‌య్యాయి. దాంతో ఆ ఆల‌యంలో పూజారిగా ప‌నిచేస్తున్న ద్వివేది అనే వ్య‌క్తి స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు విచార‌ణ చేప‌డుతున్న స‌మ‌యంలో ఆ విగ్ర‌హాలు ఓ ప్ర‌దేశంలోని బావిలో ఉన్న‌ట్లు తెలిసింది. వాటిని వెలికితీసిన పోలీసులు ఆల‌యానికి ఇవ్వ‌డానికి మాత్రం ఒప్పుకోలేదు. అవి చాలా ఖ‌రీదైన‌వి కావ‌డంతో 40 ల‌క్ష‌లు చెల్లిస్తేనే ఇస్తామ‌ని పూజారికి చెప్పారు. దాంతో ఏం చేయాలో తెలీని పూజారి ఎవ‌రికి చెప్పాలో తెలీక ఆ విష‌యాన్ని అక్క‌డితో వ‌దిలేసాడు. 29 ఏళ్ల త‌ర్వాత మ‌హవీర్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ ఆచార్య కిశోర్ కుమార్ ఎలాగైనా ఆ విగ్ర‌హాల‌ను విడిపించాల‌ని అనుకున్నారు. ఎస్పీతో మాట్లాడి పోలీస్ రూంలో దాచిన విగ్ర‌హాల‌ను బ‌య‌టికి తీయించారు. ఆ త‌ర్వాత కోర్టు నుంచి అనుమ‌తి తెచ్చుకుని పోలీస్ స్టేష‌న్‌లోనే విగ్ర‌హాల‌కు అభిషేకాలు పూజ‌లు నిర్వ‌హించి వాటిని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ప్ర‌తిష్ఠించారు. అలా రామ న‌వ‌మికి ముందు రోజు ఆంజ‌నేయ స్వామి విగ్ర‌హం ఆల‌యానికి చేరుకుంద‌ని గ్రామ‌స్థులు సంతోషించారు.